ODI WC 2023 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) వరల్డ్ కప్ అప్డేటెడ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. శ్రీలంక(Srilanka), నెదర్లాండ్స్(Netherlands) జట్లు వలర్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించడంతో సవరణలతో కూడిన షెడ్యూల్‌ను ఈరోజు ప్రకటించింది. అక్టోబర్ 7న శ్రీలంక జట్టు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. నవంబర్ 9న లంక ఆఖరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు అక్టోబర్ 6న తమ తొలి పోరులో పాకిస్థాన్‌ను ఎదుర్కోనుంది.
జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(ODI World Cup Qualifiers 2023) పోటీల్లో అదరగొట్టిన శ్రీలంక, నెదర్లాండ్స్ ఆఖరి రెండు బెర్తులను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో లంక 128 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి వరల్డ్ కప్ క్వాలిఫయర్ చాంపియన్‌గా నిలిచింది. రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న భారత గడ్డపై మొదలవ్వనుంది. ఆరంభ పోరులో 2019 ఫైనలిస్టులు న్యూజిలాండ్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అక్టోబర్ 15న జరగనుంది. నవంబర్ 19న ఫైనల్ ఫైట్ ఉంది. ఈ ఏడాది వరల్డ్ కప్ ప్రత్యేకత ఏంటంటే..? ఫైనల్‌తో పాటు సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్ డే(Reserve Day)ను కేటాయించింది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.
అహ్మదాబాద్‌లో తలపడనున్న భారత్, పాక్ జట్లు
అయితే.. దాయాది పాకిస్థాన్(Pakistan) జట్టు భారత్‌కు రావడంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. పాక్ జట్టుకు ఆ దేశ క్రికెట్ బోర్డు(PCB) అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణం. అయితే.. ఈ మెగా టోర్నమెంట్లో పాక్ ఆడడంపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది. మరోవైపు సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2011లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) సారథ్యంలో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ఈసారి ట్రోఫీపై కన్నేసింది.