ఢిల్లీ : మహిళల వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆడబోయే తొలి సిరీస్ వాయిదా పడింది. స్వదేశంలో ఉమెన్ ఇన్ బ్లూ.. డిసెంబర్లో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల (3 వన్డేలు, 3 టీ20లు) సిరీస్లు ఆడాల్సి ఉంది. ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్లో భాగంగా బంగ్లా ఈ పర్యటనకు రావాల్సి ఉన్నా ఇరుదేశాల సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభనతో సిరీస్ను వాయిదా వేసినట్టు తెలుస్తున్నది. సిరీస్ వాయిదా విషయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ధృవీకరించింది. ‘సిరీస్ రద్దు గురించి బీసీసీఐ నుంచి మాకు లేఖ అందింది.
త్వరలోనే కొత్త తేదీలు, వివరాలు వెల్లడిస్తాం’ అని బీసీబీ ప్రతినిధి తెలిపారు. ఇక దీనిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా బోర్డు వర్గాలు స్పందిస్తూ.. ‘డిసెంబర్లో ప్రత్యామ్నాయ సిరీస్ కోసం ఇతర దేశాల బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నాం. బంగ్లాదేశ్తో సిరీస్పై అయితే మేం ముందుకెళ్లడం లేదు’ అని తెలిపాయి. ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా మరణశిక్ష నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాల్లో స్తబ్ధత నెలకొన్నది. ఈ ఏడాది ఆగస్టులో అక్కడ నెలకొన్న అల్లర్లతో పురుషుల జట్టు బంగ్లాదేశ్ పర్యటననూ బీసీసీఐ వాయిదా వేసిన విషయం విదితమే.