ఢాకా: టీ20 వరల్డ్‌కప్(T20 World Cup) వేదికలను మార్చడానికి ఐసీసీ నిరాకరించడంతో.. ఆ టోర్నీను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బహిష్కరించింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్న వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ఇండియా వెళ్లడం లేదని బంగ్లా క్రికెట్ బోర్డు పేర్కొన్నది. గురువారం ఢాకాలో క్రికెట్ బోర్డు, జాతీయ క్రికెటర్లు, క్రీడా మంత్రి ఆసిఫ్ నజ్రుల్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆటగాళ్ల భద్రతకు సమస్య లేదని ఐసీసీ పేర్కొన్నా .. ఇండియాలో ట్రావెల్ చేసేందుకు బీసీబీ నిరాకరిస్తున్నది.
ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరగడంతో.. ఐపీఎల్లో ఆడుతున్న ముస్తఫిజుర్‌ను తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లా క్రికెటర్లు ఇండియాలో పర్యటించేందుకు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. వేదికల మార్పు విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని నజ్రుల్ పేర్కొన్నారు. ఇండియాకు వెళ్లవద్దు అని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
అయితే తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడేందుకు తమకు ఐసీసీ అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు ఇండియాలో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. మూడు కోల్‌కతాలో, ఒకటి ముంబై వేదికగా ఆ మ్యాచ్‌లు షెడ్యూల్లో ఉన్నాయి. ఒకవేళ బంగ్లా రాకపోతే ఆ జట్టు స్థానంలో స్కాట్‌ల్యాండ్ ఆడే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.