IPL 2025 : మరికొన్ని గంటల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 18వ సీజన్ ప్రారంభం కానుంది. స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ మెరుపులు, పేస్ బౌలర్ల బుల్లెట్ బంతులు.. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి క్యాచ్‌లు పట్టే ఫీల్డర్ల విన్యాసాలు. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించనున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ బెంచ్ బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో కొత్తవాళ్లను తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ తస్కిన్ అహ్మద్(Taskin Ahmed) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం తనను సంప్రదించిందని శనివారం ఈ స్పీడ్‌గన్ వెల్లడించాడు.
“18వ సీజన్ ఐపీఎల్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ యాజయాన్యం నన్ను సంప్రదించింది. నేను అందుబాటులో ఉండడం, మా దేశ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకునే విషయాన్ని వాకబు చేసింది. మెగా వేలంలో నాతో సహా మా దేశపు క్రికెటర్లను ఏ ఫ్రాంచైజీ కొనలేదు. దాంతో, ఐపీఎల్ ఆడే అవకాశం చేజారిందని అనుకున్నా. అయితే.. నిఖార్సైన పేసర్ కోసం వెతుకుతున్న లక్నో మేనేజ్మెంట్ నన్ను తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. ఒకవేళ రీప్లేస్‌మెంట్‌గా ఎంచుకుంటే.. ఎన్ఓసీ(NOC) వస్తుందా? లేదా? అనే అంశంపై మా మధ్య చర్చలు జరిగాయి. నేను ఫిట్‌గా ఉన్నానంటే ఎన్ఓసీ అనేది సమస్యనే కాదు. ఈ విషయం గురించి మా క్రికెట్ బోర్డుతో మాట్లాడాను. మళ్లీ లక్నో టీమ్ నుంచి నాకు ఫోన్ వస్తే.. బీసీబీ నన్ను విడుదల చేస్తుందనే ఆశాభావంతో ఉన్నాను” అని తస్కిన్ మీడియాకు వివరించాడు.
ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ గండం దాటలేకపోతున్న లక్నో ఈసారైనా విజేతగా నిలవాలనే కసితో ఉంది. నాలుగేళ్లుగా ఊరిస్తున్న ట్రోఫీని ఒడిసి పట్టుకోవాలని జట్టు మేనేజ్మెంట్, ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. అయితే.. గత సీజన్లో నిప్పులు చెరిగిన యువ పేసర్లు మయాంక్ యాదవ్(Mayank Yadav), మొహ్సిన్ ఖాన్ల గాయం లక్నోను కలవర పరుస్తోంది. దాంతో, వీళ్లు ఫిట్‌గా మారి.. జట్టుతో కలిసేంత వరకూ పేస్ యూనిట్ బరువు మోసేందుకు సీనియర్ బౌలర్ అవసరం. అందుకే.. అంతర్జాతీయ టీ20ల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన తస్కిన్ సేవల్ని వినియోగించుకోవాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో చెలరేగిపోయే ఈ బంగ్లా పేసర్.. ఒక మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗯𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 🔝
Snippets of how that Historic bidding process panned out for Rishabh Pant 🎥 🔽 #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL | #LSG pic.twitter.com/grfmkuCWLD
— IndianPremierLeague (@IPL) November 24, 2024
దాంతో, తస్కిన్‌ను జట్టులో చేర్చుకుంటే తమ బౌలర్లు సత్తా చాటుతారని సంజీయ్ గొయెంకా టీమ్ అనుకుంటోంది. కానీ, ఈ విషయంపై ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. సో.. ఐపీఎల్ ఆడేందుకు ఎదురు చూస్తున్న తస్కిన్ మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదేమో. 18 వ సీజన్లో రిషభ్ పంత్ (Rishabh Pant) లక్నోకు సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్‌ను విజయంతో ఆరంభించాలని అనుకుంటున్న లక్నో మార్చి 24న తమ తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఢీ కొట్టనుంది.