EV Insurance | ఎలక్ట్రికల్ వాహనాల (EV Insurance) బీమాకు డిమాండ్ పెరుగుతున్నది. పాలసీ బజార్ ఇంటర్నల్ డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఈవీ బీమా డిమాండ్ 16 రెట్లు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈవీ కార్ల బీమా వాటా కేవలం 0.50శాతం మాత్రమే ఉండగా.. మార్చి 2025 నాటికి 14శాతానికి పెరిగిందని ప్రైవేటు రంగ బీమా కంపెనీ ఓ నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పాలసీ బజార్ ఇన్సూరెన్స్ సీబీవో అమిత్ ఛబ్రా మాట్లాడుతూ ఈవీ బీమా డిమాండ్.. సస్టెయినబుల్ మొబిలిటీ వైపు భారత్ పయనిస్తుందనేదానికి సంకేతమని పేర్కొన్నారు.
ఈవీ బీమా వాటా గత మూడేళ్లలో 16 రెట్లు పెరిగిందని తెలిపారు. ఇది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడమే కాకుండా అవసరమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నట్లుగా అర్థమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో విక్రయించిన మొత్తం ద్విచక్ర వాహనాల బీమా పాలసీల్లో 7-8శాతం ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలకు చేయబడిందని చెప్పారు. గతేడాది కాలంలో ఈ సంఖ్య రెట్టింపు కావడం విశేషం. గతేడాది 10వేల ఈవీ ద్విచక్ర వాహనాలకు బీమా చేయగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 20వేలకు చేరింది. ద్విచక్ర వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లదే అత్యధిక వాటా కాగా.. బీమా చేసిన ద్విచక్ర వాహనాల్లో ఈవీ 98-99శాతం ఉన్నాయి.
దేశంలోని ఐదు బడా మెట్రో నగరాలైన ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పూణే, చెన్నై, ముంబయి-థానేలో ఈవీ బీమాకు భారీ డిమాండ్ ఉన్నది. ఆయా నగరాల్లో మొత్తం 55శాతం ఈవీ బీమా పాలసీలను వాహనదారులు కొనుగోలు చేశారు. ఢిల్లీ-ఎన్సీఆర్ 18.3 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. బెంగళూరు 16 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. పుణె (7.6శాతం), చెన్నై (6.7శాతం), ముంబయి-థానే (6.4శాతం) డిమాండ్ ఉన్నది. డేటా ప్రకారం.. ఈవీ బీమాలో 58శాతం టైర్-1 నగరాల నుంచి రాగా.. టైర్-2 నుంచి 30శాతం, టైర్-3 నగరాల వాటా 12శాతంగా ఉన్నది.