Chiyaan Vikram | పా. రంజిత్‌తో తంగలాన్ వంటి సూపర్ హిట్ అందుకున్న నటుడు చియన్ విక్రమ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇందులో భాగంగానే ఆయన నటిస్తున్న ఒక చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’(Veera Dheera Sooran). ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మిస్తుంది. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌ను వదలగా మంచి స్పందన తెచ్చుకుంది. అయితే విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తాజాగా తెలుగులో ప్రమోషన్స్ నిర్వహించింది చిత్రయూనిట్.
ఈ వేడుకకు నటులు విక్రమ్‌తో పాటు ఎస్జే సూర్య వచ్చి సందడి చేశారు. అయితే వేడుకలో ఒక రిపోర్టర్ విక్రమ్‌ని అడుగుతూ.. తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు ఎందుకు చేయట్లేదని అడుగుతాడు. దీనికి సమాధానంగా విక్రమ్ మాట్లాడుతూ.. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మంచి కథ దొరకకపోవడం. మరోకటి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా పాకడం. పాన్ ఇండియా సినిమాల వలన నేను తమిళంలో చేసిన సినిమాను మీరు తెలుగులో ఇక్కడ చూస్తున్నారు. తెలుగులో వచ్చిన సినిమాలను నేను ఓటీటీలో తమిళంలో చూస్తున్నాను. ఇలా ఎక్కడ చేసిన చూసే భాష ఒకటే అవుతుంది కాబట్టి తెలుగులో చేయడం లేదంటూ విక్రమ్ చెప్పుకోచ్చాడు. ఈ చిత్రంలో మలయాళ విలక్షణ నటుడు సూరజ్ వెంజరముడ్తో పాటు ఎస్.జె.సూర్య, దుశరా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.