న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ప్రాతినిధ్యంపై గత కొన్ని వారాలుగా సాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. భద్రతా కారణాల రీత్యా భారత్‌లో పర్యటించలేమన్న బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బహిష్కరణ వేటు వేసింది. శనివారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొంది. బంగ్లాపై వేటుతో ఆ స్థానాన్ని ముందే ఊహించినట్లు స్కాట్లాండ్తో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సభ్యదేశాల బోర్డు సభ్యులకు చైర్మన్ జైషా నేతృత్వంలోని ఐసీసీ లేఖల ద్వారా తెలిపింది. దీంతో తమ డిమాండ్లకు తలొగ్గుతుందన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఆశలు అడిఆశలయ్యాయి.
ఐపీఎల్ నుంచి తమ దేశ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమన్‌ను తీసివేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్..టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో ఆడబోమంటూ బీరాలకు పోయింది. తమ ప్లేయర్లకు భారత్‌లో సరైన భద్రత లేని కారణంగా మ్యాచ్‌లను మరో ఆతిథ్య దేశం శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీని అభ్యర్థించింది. అయితే ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో మార్చే అవకాశం లేదంటూ ఐసీసీ స్పష్టం చేసింది. భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ఐసీసీ నివేదికలో పేర్కొన్నా..బీసీబీ మొండి వైఖరితో మెగాటోర్నీలో ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది.
‘భారత్‌లో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను అనుసరించి ఆడేందుకు బీసీబీ ఒప్పుకోలేదు. భద్రతా పరమైన కారణాలపై బీసీబీ సందేహాలను ఐసీసీ పూర్తిగా నివృతి చేసింది. భారత్‌లో ఆడే విషయంలో 24 గంటల వ్యవధిలో నిర్ణయం చెప్పాలని కోరినా బీసీబీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ కారణంగా బంగ్లాను తప్పిస్తూ స్కాట్లాండ్కు అవకాశం కల్పించాం’ అని ఐసీసీ పేర్కొంది.
బంగ్లా గైర్హాజరీలో గ్రూపు-సీలో స్కాట్లాండ్ బరిలోకి దిగనుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో బంగ్లా తర్వాత స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు అనుకోని అవకాశం లభించింది. గ్రూపు-సీలో ఇటలీ, ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్‌తో స్కాట్లాండ్ పోటీపడనుంది. ఫిబ్రవరి 7న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో స్కాట్లాండ్..విండీస్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది.
బంగ్లాపై బహిష్కరణతో టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును పంపించే విషయంలో పునరాలోచన చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మోహిసిన్ నఖ్వి పేర్కొన్నాడు. బంగ్లాపై సస్పెన్షన్‌తో ఐసీసీ ద్వంద ప్రమాణాలు పాటిస్తుందని నఖ్వి ఆరోపించాడు. వరల్డ్‌కప్‌లో పాక్ ఆడేది లేనిది తమ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నాడు.