Imrul Kayes : బంగ్లాదేశ్ క్రికెటర్లు వరుసపెట్టి వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అవ్వగా.. మహ్మదుల్లా సైతం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడు. తాజాగా ఆ దేశానికి చెందిన సీనియర్ ఆటగాడు ఇమ్రుల్ కయెస్ (Imrul Kayes) వీడ్కోలు నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. జాతీయ జట్టులో అవకాశాలు రాకపోవడంతో ఏకకాలంలో టెస్టులతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే.. వన్డే, టీ20లు, ఫ్రాంచైజ్ క్రికెట్లో కొనసాగుతానని ఇమ్రున్ చెప్పాడు.
తన రిటైర్మెంట్ వార్తను ఇమ్రుల్ ఫేస్బుక్ వేదికగా అభిమానులకు తెలియజేశాడు. స్వదేశంలో జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్‌లో తనకు రెడ్ బాల్ క్రికెట్లో ఆఖరి మ్యాచ్ అని ఇమ్రుల్ వెల్లడించాడు. ‘నేను నవంబర్ 16వ తేదీన టెస్టులు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నా. నా జీవితంలో నేను తీసుకున్న కష్టతరమైన, భావోద్వేగపరమైన నిర్ణయమిది’ అని తెలిపాడు.
🚨IMRUL KAYES RETIRES FROM TESTS#ThankYouImrul #FamilyCake #Alltime pic.twitter.com/5ItUBMZ8yO
— bdcrictime.com (@BDCricTime) November 13, 2024
ఒకప్పుడు బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ అయిన ఇమ్రుల్ కేవలం 39 టెస్టులు ఆడాడు. తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) జోడీగా అతడు బంగ్లాకు అదిరే ఆరంభాలు ఇచ్చాడు. వీళ్లిద్దరూ 53 ఇన్నింగ్స్‌ల్లో 2,336 పరుగులు జోడించారు. 2019లో భారత జట్టుపై ఈడెన్ గార్డెన్స్‌లో చివరిసారిగా వైట్ జెర్సీ వేసుకున్నాడు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. స్వల్ప కెరీర్లో అతడు మూడు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలతో కలిపి.. 1,797 పరుగులు సాధించాడు.