న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎట్టకేలకు మేయర్ ఎన్నికలు జరిగాయి. (Delhi Mayor elections) హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఢిల్లీ కొత్త మేయర్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) నేత మహేష్ ఖించి ఎన్నికయ్యారు. కరోల్ బాగ్‌లోని దేవ్ నగర్ కౌన్సిలర్ అయిన ఆయన 133 ఓట్లు సాధించారు. 130 ఓట్లు దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. 265 ఓట్లు పోల్ కాగా, రెండు ఓట్లు చెల్లనివిగా పరిగణించారు. దీంతో ఆప్ నేత మహేష్‌కు విజయం వరించింది.
కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో బీజేపీ, ఆప్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ విభేదాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో జరుగాల్సిన మేయర్ ఎన్నికలు ఆలస్యమయ్యాయి. చివరకు గురువారం ఈ ఎన్నికలు జరిగాయి. ఎంసీడీ హౌస్‌లో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాతోపాటు ఢిల్లీలోని ఏడుగురు బీజేపీ ఎంపీలు కూడా పాల్గొన్నారు.
మరోవైపు మేయర్ పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్ సబిలా బేగం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆప్ అభ్యర్థికి ఓటు వేస్తానని ఆమె పేర్కొన్నారు. మేయర్‌గా గెలిచిన ఆప్ నేత మహేష్, ఆ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ స్థానంలో ఆ బాధ్యతలు చేపడతారు. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన మూడో మేయర్‌గా ఆయన నిలుస్తారు.