Shakib Al Hasan : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ (Shakib Al Hasan) కెరీర్ ప్రమాదంలో పడనుంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీబుల్‌పై చర్యలు తీసుకునేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సిద్దమైంది. పాకిస్థాన్‌తో రావల్పిండిలో జరుగుతున్న తొలి టెస్టు తర్వాత ఈ ఆల్‌రౌండర్ భవితవ్యం తేల్చేందుకు బీసీబీ రెడీగా ఉంది. దాంతో, అతడి కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.
ఒకవేళ హత్య కేసులో దోషీగా తేలి షకీబ్ జైలుకు వెళ్తే అతడి క్రికెట్ ప్రస్థానం ముగిసినట్టే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. షకీబ్‌పై ఆగస్టు 25న హత్య కేసు నమోదైంది. వస్త్ర పరిశ్రమలో పనిచేసే తన కుమారుడు రూబెల్‌ను ఆగస్టు 5న హత్యకు గురయ్యాడని, ఆ మర్డర్‌లో షకీబుల్ హసన్ పాత్ర ఉందని అతడి తండ్రి రఫికుల్ ఇస్లాం కేసు వేశాడు. దాంతో, సుప్రీం కోర్టు న్యాయవాది షాజిబ్ మహమూద్ అలామ్ బీసీబీకి లీగల్ నోటీసు పంపాడు.
బంగ్లా క్రికెట్ బోర్డుకు ఈమెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపిన నోటీసులో షకీబుల్లను తక్షణమే అన్ని ఫార్మట్ల నుంచి తొలగించాల్సిందిగా ఆయన ఆదేశించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమాల ప్రకారం హత్య కేసు లేదా డోపింగ్ వంటి వాటిలో అరోపణలు ఎదుర్కొనేవాళ్లు జాతీయ జట్టులో ఆడేందుకు అనర్హులు.