Model Markets | సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఆదర్శ మార్కెట్ ఉండాలన్న లక్ష్యం నీరుగారుతున్నది. అందుబాటులోకి వచ్చిన మోడల్ మార్కెట్లను ఇతర అవసరాల పేరిట ప్రైవేట్‌పరం చేసే పనిలో ఉన్నారు. వాస్తవంగా అందుబాటులోకి వచ్చిన చోట స్థానికులకు సూపర్‌మార్కెట్‌లా ఈ మోడల్ మార్కెట్లు ఉపయోగపడాలి. కానీ మోడల్ భవనాలను ఏకంగా సీఎస్ఆర్ కింద ఫౌండేషన్లకు అప్పగిస్తున్నారు.
తాజాగా, సీఎస్ఆర్ కింద డాక్టర్ విజయ్‌కుమార్ దాట్ల ఫౌండేషన్, బయోలాజికల్ ఈ లిమిటెడ్‌కు మోడల్ మార్కెట్ భవనాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఏడాదిపాటు అప్పగించారు. స్కిల్లింగ్ అండ్ లివ్లీహుడ్ ప్రోగ్రాం కింద స్లమ్స్‌లోని పేద మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఆయా అంశాల్లో తగిన శిక్షణతో నైపుణ్యం కల్పించడంతో పాటు వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా, ఉపాధి పొందేలా సహకరిస్తామ ని సదరు ఫౌండేషన్ జీహెచ్ఎంసీకి తెలియజేసింది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలుపగా, కూకట్పల్లి జోనల్ కమిషనర్‌తో ఏడాదిపాటు ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే మున్ముందు ఇంకెన్ని మోడల్ మార్కెట్ భవనాలు ఇతర అవసరాలకు మళ్లిస్తారో చూడాల్సి ఉన్నది.
ప్రశాంతమైన వాతావరణం, వెజిటెబుల్, నాన్‌వెజ్, స్టోర్ వేర్వేరుగా ఉంటున్నా యి. శాకాహార, మాంసాహార అమ్మక కేంద్రాలు, తినుబండారాల దుకాణాలు, ఫార్మసీ, ఏటీఎంలు, గ్రాసరీ, డ్రైఫ్రూట్ దుకాణాల ఏర్పాటు జీ+1 నిర్మాణంతో ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్లు 10,000 లీటర్ల సామర్థ్యంలో భూగర్భ సంప్‌లు, 10వేల లీటర్ల సామర్థ్యం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లు కలిగి ఉన్నాయి.
గ్రేటర్లో ప్రతి పది వేల మందికి ఒక మోడల్ మార్కెట్ ఉండాలనే లక్ష్యంతో మో డల్ మార్కెట్ల నిర్మాణాలను బల్దియా చేపట్టింది. దాదాపు 40 మోడల్ మార్కెట్లు నిర్మించినా.. వాటిని వినియోగంలోకి తీసుకురావడంలో విఫలమైంది. అంతేకాకుండా పురోగతిలో ఉన్న పనులను సైతం పట్టించుకోవడం లేదు. చిక్కడపల్లిలో రూ.40 కోట్లు, అమీర్‌పేటలో రూ. 13.20 కోట్లు, పంజాగుట్టలో రూ.6.70 కోట్ల తో నిర్మించాల్సి ఉండగా, ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్న చందంగా పనులను పక్కన పెట్టారు. నారాయణగూడ ఓల్డ్ మున్సిపల్ వెజిటేబుల్ మార్కెట్ వద్ద రూ. 4 కోట్లతో చివర దశకు వచ్చిన పనులను సైతం పూర్తి చేయలేకపోతున్నారు. ఫలితంగా స్థానికులు వారాంతపు సంతలపై ఆధారపడాల్సి వస్తున్నది. కమిషనర్ స్పందించి మోడల్ మార్కెట్లపై సమీక్షించి.. పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.