Women’s Canteens | మేడ్చల్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): మహిళ సాధికారిత దిశగా మహిళా క్యాంటీన్ల ఏర్పాటులో త్రీవ జాప్యం కనపడుతుంది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు చెబుతున్నప్పటికీ అంతగా ఫలితాలు సాధించలేక పోతుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులచే మహిళా శక్తి ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించిన ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐదింటిని ఏర్పాటు చేయాలని లక్ష్యం సూచించిన ఇప్పటి వరకు నేరవేరలేదు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఘట్కేసర్, మేడ్చల్, శామీర్‌పేట్, కీసర మండలాలలో మహిళా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పాటు జిల్లాలోని 13 మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సర్కిళ్లతో సహా మొత్తంగా 20 మహిళా క్యాంటీన్ల ఏర్పాటుకు చేసేలా చూస్తున్న అమలులో మాత్రం సాధ్యం కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 3.3392 మహిళ సంఘాలు ఉండగా, ఇందులో 37,670 మంది సభ్యులు ఉన్నారు. మహిళ సంఘాల ఆధ్వర్యంలో చేసుకుంటున్న వ్యాపారాల అర్హత ప్రకారం, మహిళ సంఘాలకు బ్యాంకుల ద్వారా లింకేజీ రుణాలను అందిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు మహిళా క్యాంటీన్ల ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అందించే విధంగా చూసిన క్యాంటీన్ల ఏర్పాటులో మాత్రం ఫలితం కనుబడుట లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు నాలుగు మండల కేంద్రాలైన ఘట్కేసర్, కీసర, శామీర్‌పేట్, మేడ్చల్‌లో ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇప్పటి వరకు మహిళా క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా క్యాంటీను ఏర్పాటుకు ప్రత్యేక గదులు కేటాయించిన ఇప్పటి వరకు ప్రారంభానికి మాత్రమే నోచుకోలేదు.