వన్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు అభిమానులను ఆద్యంతం అలరించింది. వాతావరణం కాలుష్యం కారణంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాల మధ్య సాగిన పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్‌దే పైచేయి అయ్యింది. చరిత అసలంక సెంచరీతో పోరాడే స్కోరు అందుకున్న లంక..బంగ్లాను నిలువరించలేకపోయింది. కెప్టెన్ షకీబల్ హసన్, నజ్ముల్ హసన్ అర్ధసెంచరీలతో 53 బంతులు మిగిలుండగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుసగా ఆరు ఓటములకు పుల్‌స్టాప్ పెడుతూ లంకను మెగాటోర్నీ నుంచి దిగ్విజయంగా సాగనంపింది. మ్యాచ్ మొత్తం ఒక ఎత్తయితే సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో అంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్ నిర్ణయం హైలెట్‌గా నిలువడం విశేషం.
ఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక వరుస ఓటముల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా భారత్ చేతిలో భారీ ఓటమితో కృంగిపోయిన లంకను బంగ్లాదేశ్ చావుదెబ్బ కొట్టింది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 3 వికెట్ల తేడాతో లంకను ఓడించింది. తొలుత చరిత అసలంక(105 బంతుల్లో 108, 6ఫోర్లు, 5సిక్స్‌లు) సాధికారిక సెంచరీతో లంక 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసింది. సమరవిక్రమ(41), పతున్ నిస్సనక(41) ఆకట్టుకున్నారు. తంజిమ్ హసన్(3/80) మూడు వికెట్లు పడగొట్టగా, షకీబల్ హసన్, షరీఫుల్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 41.1 ఓవర్లలో 282/7 స్కోరు చేసింది. నజ్ముల్ హుసేన్(90), షకీబల్ హసన్(82) అర్ధసెంచరీలతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించారు. 41 పరుగులకే ఓపెనర్లు లిటన్ దాస్(23), తంజిద్ హసన్(9) వికెట్లు కోల్పోయిన బంగ్లాను వీరిద్దరు తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టారు. మదుషనక(3/69) మూడు వికెట్లతో రాణించగా, తీక్షణ, మాథ్యూస్ రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. రెండు వికెట్లకు తోడు అర్ధసెంచరీతో రాణించిన షకీబల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
అసలంక అదుర్స్:వరుస ఓటముల నుంచి తేరుకోవాలనుకున్న లంకకు బంగ్లా రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. టాప్-8లో నిలువడం ద్వారా చాంపియన్స్ ట్రోఫీ(2025)కి అర్హత సాధించాలనుకున్న లంక ఆశలపై బంగ్లా నీళ్లు గుమ్మరించింది. కుశాల్ పెరెరా(4) రూపంలో లంక తొలి వికెట్ కోల్పోగా, కెప్టెన్ కుశాల్ మెండిస్(19) ఆకట్టుకోలేకపోయాడు. ఒకానొక దశలో 135 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లంకను అసలంక ఆదుకున్నాడు. సహచర బ్యాటర్ల అండతో బంగ్లా బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ కెరీర్లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.
నజ్ముల్, షకీబ్ సూపర్
నిర్దేశిత లక్ష్యఛేదనలో బంగ్లాకు సరైన శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు లిటన్ దాస్, తంజిద్ హసన్ ఆకట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో నజ్ముల్, షకీబ్ సాధికారిక ఇన్నింగ్స్‌తో కదంతొక్కారు. వీరిద్దరు లంక బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. మూడో వికెట్‌కు వీరిద్దరు కలిసి 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విజయానికి కారణమైంది. ఆఖర్లో లంక పుంజుకునేందుకు ప్రయత్నించినా బంగ్లా పోరాటంతో ఫలితం లేకపోయింది. మాథ్యూస్ వరుస ఓవర్లలో షకీబ్, నజ్ముల్‌ను ఔట్ చేసినా అప్పటికే జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక: 49.3 ఓవర్లలో 279 ఆలౌట్(అసలంక 109, నిస్సనక 41, తంజిమ్ 3/80, షరీఫుల్ 2/51), బంగ్లాదేశ్: 41.1 ఓవర్లలో 282/7(నజ్ముల్ 90, షకీబల్ 82, మదుషనక 3/69, మాథ్యూస్ 2/35)