T20 World Cup : వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ తొలగించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఐసీసీకి నష్టం ఏమీ లేదు. కానీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మాత్రం భారీగా నష్టపోనున్నట్లు తెలుస్తోంది. బీసీబీతోపాటు ఆటగాళ్లు కూడా వ్యక్తిగతంగా నష్టపోనున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదిక ప్రకారం.. ఈ టోర్నీలో లీగ్ మ్యాచుల్లో ఆడితే మ్యాచ్ ఫీజుల ద్వారా బీసీబీకి మన కరెన్సీ విలువ ప్రకారం దాదాపు రూ.2.75 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది.
అంటే టోర్నీ నుంచి వైదొలగడం ద్వారా ఈ మొత్తాన్ని కోల్పోయినట్లే. అలాగే, లీగ్ దశలు దాటి క్వార్టర్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ వరకు చేరుకోవడం వంటివి జరిగితే ఈ ఫీజులు ఇంకా ఎక్కువగా వచ్చేవి. అంతేకాదు.. ఈ టోర్నీ నుంచి వైదొలుగుతామని బీసీబీనే ఐసీసీకి చెప్పింది. ఈ అంశంపై ఐసీసీ.. బీసీబీకి జరిమానా విధించే అవకాశం ఉంది. అంటే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సరైన కారణం లేకుండా టోర్నీ నుంచి తప్పుకొంటే ఏ జట్టైనా రూ.1.8 కోట్లు చెల్లించాలి. అయితే, ఐసీసీ.. బంగ్లాదేశ్‌కు ఈ ఫైన్ వేస్తుందా లేదా తెలియదు. ఇక టోర్నీలో షేర్ మాత్రమే కాకుండా ఆటగాళ్ల కాంట్రాక్టులు, వివిధ బ్రాండ్లతో ఒప్పందాలు వంటి ఆదాయ మార్గాల ద్వారా బంగ్లా జట్టుకు మొత్తంగా రూ.24 కోట్ల వరకు ఆదాయం వచ్చేది.
ఇప్పుడు ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల బంగ్లా జట్టుకు ఈ మేర నష్టం కలగనుంది. మరోవైపు ఐసీసీ నిర్ణయాన్ని బంగ్లా జట్టు అంగీకరించింది. టోర్నీ నుంచి బంగ్లా జట్టును తొలగిస్తూ ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై ఆ జట్టు కోర్టుల్లో కేసు వేస్తుందేమో అని భావించినా.. అలాంటి పరిణామాలేవీ కనిపించడం లేదు. ఐసీసీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు బీసీబీ ప్రతినిధులు తెలిపారు.