గాలె: కెప్టెన్ నజ్ముల్ హోసేన్ శాంతో (136 నాటౌట్, 14 ఫోర్లు, 1 సిక్స్), సీనియర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ (105 నాటౌట్, 5 ఫోర్లు) అజేయ శతకాలతో చెలరేగడంతో గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ మొదటి రోజే అదరగొట్టింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో భాగంగా శ్రీలంకతో మంగళవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.
45 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన బంగ్లాను నజ్ముల్, రహీమ్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ లంక బౌలర్ల దాడిని సమర్థవంతంగా అడ్డుకోవడమే గాక అజేయమైన నాలుగో వికెట్కు 247 పరుగులు జోడించి ఆ జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్నారు. లంక అరంగేట్ర స్పిన్నర్ తరిందు రత్నయకె (2/124) ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి పర్యాటక జట్టును ఒత్తిడిలోకి నెట్టినా ఆ తర్వాత అతడితో పాటు మిగిలిన బౌలర్లూ తేలిపోయారు.