Badminton | కింగ్డొ (చైనా) : ఈ ఏడాది పలు బీడబ్ల్యూఎఫ్ టోర్నీలలో ఆశించిన ఫలితాలు సాధించక సతమతమవుతున్న భారత షట్లర్లకు మరో ప్రతిష్టాత్మక టోర్నీ సవాల్ విసరనుంది. మంగళవారం నుంచి కింగ్డొ వేదికగా బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్ (బీఏఎంటీసీ) మొదలుకానుంది. గత ఎడిషన్లో కాంస్యం సాధించిన భారత జట్టు ఈసారి పతకం రంగు మార్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
అయితే 2023 ఎడిషన్లో భారత్ పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన స్టార్ షట్లర్ పీవీ సింధు లేకపోవడం భారత్కు భారీ లోటు. ఈ టోర్నీలో భారత్ 13 మంది బృందంతో బరిలోకి దిగుతోంది. లక్ష్యసేన్, ప్రణయ్, సాత్విక్-చిరాగ్, ధ్రువ్, అర్జున్, సతీశ్ కుమార్ బరిలో ఉన్నారు. మహిళల విభాగంలో మాళవిక, గాయత్రి గోపీచంద్, త్రీసా జాలి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆధ్య వరియత్ బాధ్యతలను మోయనున్నారు.