Australia vs England | లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. 2009 నుంచి ఈ మెగాటోర్నీలో గెలుపు ఎరుగని ఆసీస్ రికార్డు విజయంతో కదంతొక్కింది. శనివారం లాహోర్‌లో ప్రియమైన ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో జరిగిన హై స్కోరింగ్ పోరులో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఒక జట్టుపై ఇదే అత్యధిక పరుగుల ఛేదనగా రికార్డుల్లోకెక్కింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 352 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మరో 15 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది.
జోష్ ఇంగ్లిస్(86 బంతుల్లో 120 నాటౌట్, 8ఫోర్లు, 6సిక్స్‌లు) వీరోచిత సెంచరీకి తోడు అలెక్స్ క్యారీ(69), షార్ట్(63), మ్యాక్స్‌వెల్(32 నాటౌట్), లబుషేన్(47) రాణించారు. వుడ్, ఆర్చర్, కార్స్, రషీద్, లివింగ్‌స్టోన్ ఒక్కో వికెట్ తీశారు. 27 పరుగులకే హెడ్(6), కెప్టెన్ స్మిత్(5) వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను ఇంగ్లిస్ ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వన్డేల్లో తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. సహచర బ్యాటర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ మెరుపులతో ఆసీస్ చాంపియన్స్ ట్రోఫీలో అదిరిపోయే బోణీ కొట్టగా, ఇంగ్లండ్ కోలుకోలేని దెబ్బ పడింది. తొలుత డకెట్(165) సూపర్ సెంచరీతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 351/8 స్కోరు చేసింది. డకెట్ ఒంటరి ప్రదర్శనతో ఇంగ్లండ్ భారీ స్కోరు అందుకుంది. డ్వారిష్(3/66), జంపా(2/64), లబుషేన్(2/41) ఆకట్టుకున్నారు. ఇంగ్లిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.