Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సోమవారం పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పీసీబీ తెలిపింది. రెండు బృందాలుగా ఆసిస్ టీమ్ పాక్ చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లో బుధవారం కరాచీలో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలవనున్నది. ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 22న గడాఫీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తలపడనున్నది.
చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ గ్రూప్-ఏలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-బీలో ఉన్నాయి. శ్రీలంకతో రెండు మ్యాచుల వన్డే సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు నేరుగా పాక్‌కు చేరుకుంది. రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆ తర్వాత.. ఫిబ్రవరి 25న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో రెండో మ్యాచ్ ఆడుతుంది. 28న గడాఫీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది.
ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చగ్నే, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.