మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ అదిరిపోయే బోణీ కొట్టాడు. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్ తన తొలి రౌండ్లో అలవోక విజయం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో జొకొవిచ్ 6-3, 6-2, 6-2తో పెడ్రో మార్టినెజ్(స్పెయిన్)ను చిత్తు చేశాడు. తద్వారా రెండు అరుదైన రికార్డులను జొకో తన ఖాతాలో వేసుకున్నాడు.
21వ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఓవరాల్‌గా 81వ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఆడుతున్న ఈ సెర్బియా స్టార్ మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. మెల్బోర్న్ పార్క్‌లో 100వ విజయంతో కొత్త రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ విషయానికొస్తే అన్‌సీడెడ్ మార్టినెజ్‌పై జొకోవిచ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. వయసు పెరుగుతున్నా తనలో చేవ తగ్గలేదని చేతల్లో నిరూపిస్తూ మ్యాచ్ మొత్తమ్మీద జొకో 14 ఏస్‌లు సంధించాడు. మ్యాచ్‌లో 12 బ్రేక్ పాయింట్లకు గాను ఐదింటిని కాపాడుకున్న ఈ దిగ్గజ ప్లేయర్ 18 గేములు గెలిచాడు.
మరోవైపు ఆరుసార్లు అనవసర తప్పిదాలు చేసిన మార్టినెజ్ మూల్యం చెల్లించుకున్నాడు. జొకోకు ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయిన అన్‌సీడెడ్ మార్టినెజ్ రెండు ఏస్‌లకు పరిమితమయ్యాడు. మరో సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ సీనియర్ ప్లేయర్ వావ్రింకా 5-7, 6-3, 6-4, 7-6(7-4)తో జెరెపై గెలిచి ముందంజ వేశాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియాటెక్ 7-6(7-5), 6-3తో యువాన్‌పై, కొకో గాఫ్ 6-2, 6-3తో రకిమోవాపై విజయాలతో రెండో రౌండ్లోకి ప్రవేశించారు.