బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆసీస్ 2-0తో గెలుచుకుంది. బ్రిస్బేన్లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 122 పరుగుల తేడాతో చిత్తైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 371 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆ జట్టు యువ ఓపెనర్ జార్జియా వోల్ (87 బంతుల్లో 101, 12 ఫోర్లు), సీనియర్ ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీ (75 బంతుల్లో 105, 7 ఫోర్లు, 6 సిక్సర్లు)కి తోడు ఫోబె లిచ్ఫీల్డ్ (60), వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ (56) భారత బౌలర్లను ఆటాడుకున్నారు.
ఆస్ట్రేలియా టాపార్డర్ బ్యాటర్లు భారీ భాగస్వామ్యాలను నెలకొల్పి మ్యాచ్ను లాగేసుకున్నారు. అనంతరం ఛేదనలో భారత అమ్మాయిలు.. 44.5 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌట్ అయ్యారు. రిచా ఘోష్ (54), మిన్ను మణి (46), జెమీమా (43) ఫర్వాలేదనిపించారు. స్మృతి మంధాన (9) మరోసారి నిరాశపరిచింది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే పెర్త్ వేదికగా బుధవారం జరుగనుంది.