ముల్లాన్‌పూర్: స్వదేశం వేదికగా త్వరలో మొదలయ్యే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టుకు చుక్కెదురైంది. మెగాటోర్నీ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమవుదామనుకున్న టీమ్ఇండియాకు ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో భారీ ఓటమి ఎదుర్కొంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత టాస్ గెలిచిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 281/7 స్కోరు చేసింది. ప్రతీకా రావల్(64), స్మృతి మందన(58), హర్లిన్ డియోల్(54) అర్ధసెంచరీలతో రాణించారు. ఓపెనర్లు ప్రతీక, మందన ఇద్దరు మెరుగైన శుభారంభం అందించారు.
ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మేగన్ స్కట్(2/45) రెండు వికెట్లు తీసింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 44.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లిచ్‌ఫీల్డ్(88), బేత్ మూనీ(77 నాటౌట్), సదర్లాండ్(54 నాటౌట్) అర్ధసెంచరీలతో దుమ్మురేపారు. కెప్టెన్ హిలీ(27) ఒకింత నిరాశపరిచినా ఆ తర్వాత బ్యాటర్లు అలవోకగా పరుగులు సాధించారు. మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్లు ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను నేలపాలు చేసిన టీమ్ఇండియా మూల్యం చెల్లించుకుంది. క్రాంతిగౌడ్, స్నేహ్‌రానా ఒక్కో వికెట్ తీశారు. లిచ్‌ఫీల్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.