రెండున్నర నెలల పాటు పొట్టి క్రికెట్లో మునిగితేలిన అభిమానులకు ఆటలో అసలైన మజాను పంచే టెస్టు క్రికెట్‌తో అలరించేందుకు మరో మెగా ఈవెంట్ సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌కు శుభం కార్డు వేసేందుకు గాను అగ్రశ్రేణి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ ఇరుజట్లూ బుధవారం నుంచి ‘గద’ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సైకిల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ముఖాముఖి తలపడనుండటం ఇదే ప్రథమం. ఇప్పటికే రెండంకెల (10) ఐసీసీ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్న కంగారూలు ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగనుండగా ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకునే దిశలో సఫారీలు మరో కీలక పోరుకు సిద్ధమయ్యారు.
లండన్: రెండేండ్లకోసారి ఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్‌కు శుభం కార్డు పడే వేళైంది. రెండేండ్లపాటు 9 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ సైకిల్లో 69.44 శాతంతో అగ్రస్థానం దక్కించుకున్న దక్షిణాఫ్రికా.. 19 టెస్టులాడి 13 విజయాలు, 67.54 శాతంతో రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా.. గద కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత రెండు ఎడిషన్ల మాదిరిగానే ఇంగ్లండ్ మూడోసారి ఆతిథ్యమిస్తున్న ఫైనల్‌కు ఈసారి టైటిల్ పోరు క్రికెట్ మక్కాగా పేరొందిన ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరుగనుంది.
బుధవారం నుంచి మొదలుకాబోయే ఫైనల్ సమరంలో ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగనుండగా.. తమపై ఉన్న ‘చోకర్స్’ ముద్రను చెరిపేసుకోవడంతో పాటు ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చుకునేందుకు సఫారీలకు ఇదే సువర్ణావకాశం. ఇరు జట్లలో దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్, ఎంతటి బ్యాటర్‌ను అయినా బెంబేలెత్తించే పేసర్లు, మెరికల్లాంటి ఫీల్డర్లు ఉండటంతో మ్యాచ్ ఆసాంతం రసవత్తరంగా సాగనుండటం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ఐసీసీ టోర్నీలంటేనే వందకు రెండు వందల శాతం ప్రదర్శనతో రెచ్చిపోయే కంగారూలు గదను రెండోసారి నిలబెట్టుకుంటారా? లేక సఫారీల దశాబ్దాల కల నెరవేరుతుందా? అనేది ఆసక్తికరం.
2023లో ‘ది ఓవల్’ వేదికగా భారత్‌తో జరిగిన ఫైనల్లో ఆడిన జట్టులో రెండే రెండు మార్పులతో ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. ఆ జట్టులో ఓపెనర్‌గా వచ్చిన డేవిడ్ వార్నర్.. ఇప్పుడు రిటైర్ అవగా ఆ స్థానంలో గడిచిన రెండేండ్లుగా ఎవరూ కుదురుకోవడం లేదు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు తోడుగా స్మిత్, లబూషేన్‌తో పాటు ట్రావిస్ హెడ్నూ పలు మ్యాచ్‌లలో బరిలోకి దింపినా ఆ జట్టుకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. భారత్‌తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 19 ఏండ్ల సామ్ కొన్‌స్టాస్ రూపంలో ఆసీస్‌కు ఓ ప్రత్యామ్నాయం కనబడినా డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం ఖవాజాతో పాటు లబూషేన్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. ఇక స్మిత్, హెడ్, క్యారీతో పాటు ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేసిన కామెరూన్ గ్రీన్ వంటి బ్యాటర్లతో ఆసీస్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. మిచెల్ స్టార్క్, గత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు గాయంతో దూరమైన జోష్ హాజిల్‌వుడ్, సారథి పాట్ కమిన్స్ పేస్ బాధ్యతలను మోయనుండగా నాథన్ లియన్ వంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్ ఆసీస్ సొంతం..
ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఎవరు ఆరంభించినా దక్షిణాఫ్రికా తురుపు ముక్క రబాడా పేస్ దాడిని ఎదుర్కోక తప్పదు. టెస్టులలో అంచనాలకు మించి రాణించే అతడు.. సఫారీ బౌలింగ్ యూనిట్‌కు కీలకం కానున్నాడు. ఖవాజా, రబాడా 10 టెస్టులలో ముఖాముఖి తలపడగా.. సఫారీ పేసర్ అతడిని 5 సార్లు ఔట్ చేశాడు. రబాడాకు అండగా మార్కో యాన్సెన్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. మూడో పేసర్‌గా ఆ జట్టు లుంగి ఎంగిడిని ఎంచుకుంది. దీంతో ఆసీస్ బ్యాటింగ్ దళానికి, సఫారీ బౌలింగ్ బలగానికి ఆసక్తికర పోరు ఖాయంగా కనినిపిస్తున్నది. ఇక ఆసీస్ పేస్ దళాన్ని ఎదుర్కునేందుకు గాను సౌతాఫ్రికా.. మార్క్మ్,్ర రికెల్టన్ను ఓపెనర్లుగా బరిలోకి దించుతున్నది. మూడో స్థానంలో మల్డర్, నాలుగో స్థానంలో కెప్టెన్ బవుమా ఆడనున్నారు. ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హమ్ వంటి బ్యాటర్లతో సఫారీలూ బలంగానే ఉన్నారు. ఈ సైకిల్లో దక్షిణాఫ్రికా తరఫున బెడింగ్హమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. స్పిన్నర్‌గా కేశవ్ మహారాజ్.. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఏ మేరకు కట్టడి చేస్తాడో చూడాలి.
దక్షిణాఫ్రికా: మార్క్మ్,్ర రికెల్టన్, మల్డర్, బవుమా (కెప్టెన్), స్టబ్స్, బెడింగ్హమ్, వెరెయెన్నె (వికెట్ కీపర్), యాన్సెన్, కేశవ్, రబాడా, ఎంగిడి ఆస్ట్రేలియా:ఖవాజా, లబూషేన్, గ్రీన్, స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, క్యారీ (వికెట్ కీపర్), కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, లియాన్, హాజిల్‌వుడ్