Australia Cricket : ఇంగ్లండ్ పర్యటనలో పొట్టి సిరీస్ పంచుకున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌పై గురి పెట్టింది. అందుకు తగ్గట్టే జట్టు కూర్పులో మార్పులు చేసింది. అండర్-19 వరల్డ్ కప్‌లో చెలరేగిన మహిల్ బియర్డ్‌మన్ (Mahil Beardman)ను స్క్వాడ్‌లోకి తీసుకుంది. టీ20 సిరీస్ సమయంలో గాయపడిన పేసర్ గ్జావియర్ బార్టెలెట్(Xavier Bartlett) స్థానంలో మహిల్ను ఎంపిక చేసినట్టు ఆస్ట్రేలియా సెలెక్టర్లు చెప్పారు. జూనియర్ స్థాయి క్రికెట్లో పేస్ సంచలనంగా మారిన బియర్డ్‌మన్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు.
అండర్ -19 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలవడంలో బియర్డ్‌మన్ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో టీమిండియాపై మూడు వికెట్ల(3-15)తో చెలరేగాడు. దాంతో, అతడిని మాజీ ఆటగాళ్లు ఆసీస్ క్రికెట్లో భావి తారగా అభివర్ణించారు. అనుకున్నట్టే ఇప్పుడు బియర్డ్‌మన్ కల నిజమైంది. సీనియర్ జట్టుకు ఆడే రోజు రానే వచ్చింది. ఇంగ్లండ్‌పై త్వరలో జరుగబోయే వన్డే సిరీస్‌లో ఈ యువ పేసర్ అరంగేట్రం చేయనున్నాడు. మొదటి సిరీస్‌లో మెరిసి.. కెరీర్‌ను ఘనంగా మొదలెట్టాలని బియర్డ్‌మన్ భావిస్తున్నాడు.
ఆస్ట్రేలియా వన్డే స్క్వాడ్ : ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్,మిచెల్ మార్ష్ (కెప్టెన్), సియాన్ అబాట్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నిల్లి, బెన్ ద్వారుషుయిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కామెరూన్ గ్రీన్, అరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా. మహిల్ బియర్డ్‌మన్.
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-1తో సమం చేసింది. మూడో మ్యాచ్ వర్షార్పణం కావడంతో సిరీస్‌ను పంచుకొంది. అందుకని వన్డే సిరీస్‌లో విజయమే లక్ష్యంగా కంగారూ జట్టు బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 19న నాటింగ్హమ్లో వన్డే సిరీస్ మొదలవ్వనుంది. అనంతరం సెప్టెంబర్ 21న లీడ్స్‌లో రెండో వన్డే, సెప్టెంబర్ 24, సెప్టెంబర్ 27, సెప్టెంబర్ 29న మూడు, నాలుగు, ఐదు వన్డేలు జరుగునున్నాయి.