హైదరాబాద్: పదేండ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెచుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌కు చేరింది. జూన్‌లో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా గద కోసం పోరాడనున్నాయి. రెండేండ్ల క్రితం జరిగిన ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా ట్రోఫీని ముద్దాడింది.
కాగా, సిడ్నీ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆసీస్ ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (41), కొన్‌స్టాప్ (22) భారత బౌలర్లపై తొలి నుంచే ఎదురుదాడికి దిగారు. దూకుడుగా ఆడుతూ లక్ష్యాన్ని తగ్గించేకు ప్రయత్నించారు. వారిద్దరూ ఔతైన తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్, స్టీవ్ స్మిత్ ఆకట్టుకోలేకపోయారు. అయితే ట్రావిస్ హెడ్ (34), వెబ్‌స్టర్ (39) మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. ఆచితూచి ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు.
దీంతో పదేండ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా 3-1 తేడాతో గెలుపొందింది. 2016-17 నుంచి 2022-23 మధ్య నాలుగుసార్లు భారత్ ఈ ట్రోఫీని సొంతం చేసుకున్నది. ఇప్పుడు బీజీటీ సిరీస్‌లో ఓడింది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియాకు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఆశలు గల్లంతయ్యాయి. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్‌కు ఇదే చివరి మ్యాచ్. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో 2021, 2023లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన భారత్ ఈసారి అర్హత సాధించలేకపోయింది.