Alyssa Healy : ఈ ఏడాది మహిళల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024) వేదికపై సందిగ్ధం వీడడం లేదు. బంగ్లాదేశ్లో ఈమధ్య చెలరేగిన అల్లర్లు, హింస కారణంగా మరోచోట వరల్డ్ కప్ జరపాలని ఐసీసీ (ICC) భావిస్తోంది. క్రికెటర్లు కూడా బంగ్లాలో ప్రపంచ కప్ ఆడేందుకు సిద్ధంగా లేరు. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ (Alyssa Healy) సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో టీ20 వరల్డ్ కప్ ఆడడం పెద్ద తప్పిదమే అని ఆమె అంది.
‘బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఒక మనిషిగా నా అభిప్రాయం ఏంటంటే.. అక్కడ వరల్డ్ కప్ ఆడడం అంటే పెద్ద పొరపాటు చేస్తున్నట్టే’ అని హేలీ తెలిపింది. ఆసీస్ సారథితో పాటు పలువురు క్రికెటర్లు కూడా అభద్రతాభావంతో బంగ్లాదేశ్లో వరల్డ్ కప్ ఆడలేమని అంటున్నారు. క్రికెటర్ల భద్రత విషయంలో రాజీ పడని ఐసీసీ కొత్త వేదిక కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. బీసీసీఐ నో చెప్పడంతో యూఏఈ, శ్రీలంకతో పాటు జింబాబ్వే కూడా టోర్నీ నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నెలలో మహిళ టీ20 వరల్డ్ కప్ జరగాలి. అయితే.. ఆతిథ్య హక్కులు దక్కించుకున్న బంగ్లాదేశ్ (Bangladesh)లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. హింసాత్మక దాడులతో అట్టుడ్డుకుతున్న బంగ్లాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు.
దాంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వరల్డ్ కప్ వేదికను తరలించే ప్రయత్నాల్లో ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే బీసీసీఐని ఐసీసీ సంప్రదించింది. అయితే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం ఐసీసీకి హ్యాండిచ్చింది. దాంతో, యూఏఈ, శ్రీలంకలను ప్రత్నామ్యాయ వేదికలుగా ఐసీసీ పరిగణనలోకి తీసుకుంటోంది.