బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై దర్యాప్తునకు ఆదేశించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ పార్టీ నేత తీవ్రంగా హెచ్చరించారు. దర్యాప్తును వెనక్కి తీసుకోకపోతే బంగ్లాదేశ్‌లో మాదిరిగా గవర్నర్ పారిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు. (Bangladesh like fate) కర్ణాటక గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. సీఎం సిద్ధరామయ్యపై దర్యాప్తునకు ఆదేశించిన గవర్నర్ చర్యను ఖండిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, సోమవారం మంగళూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు ఇవాన్ డిసౌజా మాట్లాడారు. ఈ సందర్భంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గవర్నర్ తన ఉత్తర్వును ఉపసంహరించుకోకపోతే లేదా ఆయనను ఉపసంహరించుకునేలా రాష్ట్రపతి చేయకపోతే బంగ్లాదేశ్‌లో మాదిరిగా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ దేశ ప్రధాని పారిపోయినట్లే ఇక్కడ కర్ణాటకలో గవర్నర్ పారిపోతారు. తమ తర్వాత నిరసన గవర్నర్ కార్యాలయం వద్దే’ అని అన్నారు.