అడిలైడ్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా తిరిగి దక్కించుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 435 పరుగుల భారీ లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 207/6తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 352 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ జెమీ స్మిత్(60), విల్ జాక్స్(47) జట్టును గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే సిరీస్‌లో సూపర్ ఫామ్‌మీదున్న మిచెల్ స్టార్క్(3/62) ఇంగ్లండ్‌ను దెబ్బతీయడంలో కీలకమయ్యాడు. ఆసీస్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలుస్తూ స్మిత్, జాక్స్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడారు.
ముఖ్యంగా వికెట్‌కీపర్, బ్యాటర్ స్మిత్ తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్ ఔట్ కావడంతో ఏడో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. బ్రాండన్ కార్స్(39 నాటౌట్)తో జత కలిసిన జాక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరు కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. స్టార్క్ బౌలింగ్‌లో లబుషేన్ కండ్లు చెదిరే క్యాచ్‌తో జాక్స్ ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. 15 పరుగుల తేడాతో ఆర్చర్(3), టంగ్(1) వెంటవెంటనే ఔట్ కావడంతో ఆసీస్ గెలుపు సంబురాల్లో మునిగి పోయింది. సెంచరీకి తోడు అర్ధసెంచరీ, ఆరు క్యాచ్‌లతో అలెక్స్ క్యారీ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈనెల 26 నుంచి ఇరు జట్ల మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టు మొదలుకానుంది.