Ashes Series : యాషెస్ సిరీస్(Ashes Series)లో వరుసగా రెండో విజయం సాధించిన ఆస్ట్రేలియా (Australia)కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్(Nathan Lyon) మిగతా టెస్టులకు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న అతడికి విశ్రాంతి ఇవ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావించడమే అందుకు కారణం. అతడి స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ(Todd Murphy) జట్టులోకి రానున్నాడు.
భారత గడ్డపై బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy)లో ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో మర్ఫీ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ ఆఫ్ స్పిన్నర్ ఇంగ్లండ్‌లో తొలి టెస్టు ఆడబోతున్నాడు. ఆసీస్ తరఫున వందో టెస్టు ఆడుతున్న లియాన్ లార్డ్స్ టెస్టు(LordsTest)లో రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. కుడి కాలికి గట్టిగా దెబ్బ తగలడంతో మైదానం వీడిన అతను మూడో రోజు బౌలింగ్ చేయలేదు. స్కానింగ్ అనంతరం కర్రల సాయంతో నడుస్తూ కెమెరా కంట పడ్డాడు. ఇక అతను డగౌట్‌కే పరిమితం అవుతాడనిపించింది.
కర్రల సాయంతో నడుస్తున్న లియాన్
కానీ, నాలుగో రోజు ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో లియాన్ ఆఖరి వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. కాలు నొప్పిని పంటి బిగువునా భరిస్తూనే ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు జతగా కీలకమైన 15 పరుగులు సాధించాడు. అతడి పోరాట పటిమతో అందర్నీ అకట్టుకున్నాడు.
లార్డ్స్ టెస్టులో పర్యాటక ఆసీస్ 43 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(155) వీరోచిత సెంచరీతో పోరాడినా ఫలితం మాత్రం మారలేదు. ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ మూడేసి వికెట్లతో చెలరేగారు. దాంతో, ఆతిథ్య జట్టు 327 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో కమిన్స్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కీలకమైన మూడో టెస్టు లీడ్స్ స్టేడియంలో జూలై 6 నుంచి జరగనుంది.