T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ తొమ్మిదో సీజన్ సంచలనాలకు వేదిక అవుతోంది. పనకూనల ప్రతాపానికి తట్టుకోలేక పెద్ద జట్లు లీగ్ నుంచి తోకముడుస్తున్నాయి. మెగా టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన న్యూజిలాండ్ (Newzealand), శ్రీలంక (Srilanka)లు ఎలిమినేట్ కాగా.. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అఫ్గనిస్థాన్ జట్టు తొలిసారి సూపర్ 8కు అర్హత సాధించి రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లెజెండరీ ఆటగాడు బ్రాడ్ హాగ్ (Broad Hogg) ఫైనల్లో తలపడేది ఎవరో చెప్పేశాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అతడు ఈసారి భారత్, ఆస్ట్రేలియా మధ్య టైటిల్ పోరు జరగునుందని ఊహించాడు.
ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్ చేరుతాయని బ్రాడ్ జోస్యం పలికాడు. ‘సూపర్ 8లో టీమిండియా, ఆసీస్‌కు అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఎదురుపడుతాయి. ఈ రెండింటినీ తేలకగా ఓడించి భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్లో అడుగుపెడుతాయి. ఒకవేళ అదే జరిగేతే కచ్చితంగా టైటిల్ పోరులో ఈ రెండు జట్లు తలపడుతాయి. నేను ఇదే జరగాలని కోరుకుంటున్నా.
బ్రాడ్ హాగ్
సూపర్ 8 మ్యాచ్‌లు వెస్టిండీస్ గడ్డపై నిర్వహించడం టీమిండియాకు కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే.. న్యూయార్క్ వంటి స్లో పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లు.. వెస్టిండీస్ గడ్డపై అలవాటు పడేందుకు టైమ్ పడుతుంది. ఒకవేళ పరిస్థితులకు వాళ్లు త్వరగా అలవాటు పడితే రోహిత్ సేన ఫైనల్ చేరినట్టే’ అని హగ్ తెలిపాడు.
నిరుడు భారత్, ఆస్ట్రేలియాలు రెండుసార్లు ఐసీసీ ఫైనల్స్(ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్ కప్) లో ఎదురుపడ్డాయి. కానీ, ఆ రెండుసార్లు ఆసీస్ విజేతగా నిలిచింది. అందుకని ఈసారి బ్రాడ్ చెప్పినట్టే ఇరుజట్లు టైటిల్ పోరుకు దూసుకెళ్తే పోటీ ఉత్కంఠగా ఉండడం ఖాయం. వరసగా రెండు ట్రోఫీలను తన్నుకెళ్లిన ఆసీస్‌పై ప్రతీకార విజయం సాధించేందుకు టీమిండియాకు ఇంతకుమించిన అవకాశం మళ్లీ రాదేమో.