Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు (Forex Reserves) నిల్వలు 430 కోట్ల డాలర్లు వృద్ధి చెంది 655.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని శుక్రవారం ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు వారం ‘మే 31’తో ముగిసిన వారానికి 4.8 బిలియన్ డాలర్లు పుంజుకుని 651.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.
ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) రిజర్వు 3.77 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 576.3 బిలియన్ డాలర్లకు పెరిగాయి. బంగారం రిజర్వు నిల్వలు 481 మిలియన్ డాలర్లు పెరిగి 56.98 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఎస్‌డీఆర్‌లు 43 మిలియన్ డాలర్లు పుంజుకుని 18.16 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐఎంఎఫ్‌లో భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 10 మిలియన్ డాలర్లు పెరిగి 4.33 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.