YS Jagan | గత ఎన్నికలతో పోలిస్తే కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ పది శాతం మంది కూడా వైసీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను గమనిస్తారని పేర్కొన్నారు. అప్పుడు ప్రజలే మళ్లీ తమను అధికారంలోకి తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. అప్పటిదాకా ఎట్టిపరిస్థితుల్లోనూ మనలో ధైర్యం సన్నగిల్లకూడదని వైసీపీ నాయకులకు సూచించారు.
గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయని విధంగా మంచి పరిపాలన అందించామని.. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నో గణనీయ మార్పులు తీసుకొచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే ఆశ్చర్యమేస్తోందని అన్నారు. శకుని పాచికల మాదిరిగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయని అనిపిస్తోందని అన్నారు. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలని అభిప్రాయపడ్డారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకొచ్చిందని.. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ఈ చట్టం తీసుకొస్తే అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు తెలిపిందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కానీ సరిగ్గా ఎన్నికల సమయంలో ఈ చట్టాన్ని ఒక భూతంలా చూపించి టీడీపీ, కూటమి పార్టీలు విష ప్రచారం చేశాయని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ వాళ్లు మద్దతు పలికిన ఈ చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామని అంటున్నారని.. వారు చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీన్నిబట్టే తెలుస్తోందని అన్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయని.. గడిచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయని జగన్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ 10 శాతం ప్రజలు వైసీపీ పాలనకు, చంద్రబాబు పాలనకు తేడాను గుర్తిస్తారనే విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో ధైర్యం సన్నగిల్లకూడదని.. పోరాట పటిమ తగ్గకూడదని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. తన వయసు చిన్నదేనని.. సత్తువ ఇంకా దగ్గలేదని జగన్ అన్నారు. దేవుడి దయ వల్ల అన్ని రకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందని తెలిపారు. ప్రజలు మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.