ఢిల్లీ: ప్రపంచ క్రీడా చరిత్రలో అత్యంత పురాతనమైన క్రీడా పండుగ అయిన ‘ఒలింపిక్స్’కు మరికొద్దిరోజుల్లో తెరలేవనుంది. పారిస్ నగరం ఆతిథ్యమిస్తున్న విశ్వక్రీడల్లో సత్తా చాటేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలాది మంది క్రీడాకారులు ‘ఒలింపిక్ విలేజ్’కు చేరుకుని పతకాలను కొల్లగొట్టేందుకు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నారు. నాలుగేండ్లకోమారు జరిగే ఈ విశ్వక్రీడా సంరంభానికి భారత్ ఈసారి 113 మందితో కూడిన క్రీడాకారుల బృందాన్ని పారిస్‌కు పంపింది. విశ్వక్రీడా యవనికపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారని 140 కోట్ల మంది ప్రజలు ఆశిస్తున్న వేళ ఈ బృందంపై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. 128 ఏండ్ల ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ఒక్క ఎడిషన్‌లోనూ ‘రెండంకెల మార్కు’ను చేరకపోయిన మన క్రీడాబృందం ఈసారైనా ‘డబుల్ డిజిట్’ను దాటేనా?

1896లో మొదలైన ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ప్రాతినిథ్యం 1900 నుంచి ఆరంభమైంది. అయితే ఈ క్రీడల్లో పాల్గొన్న నార్మన్ ప్రిచర్డ్ బ్రిటన్ దేశస్తుడు. అప్పటికీ మనదేశం బ్రిటీష్ పాలనలో ఉండటంతో నార్మన్ ఇక్కడే పుట్టి పెరిగి మనకు పతకం తీసుకొచ్చినా అతడు భారతీయుడు కాదు! ఒలింపిక్స్‌లో ఒక గుర్తింపు దేశంగా భారత్ 1920 నుంచి అధికారికంగా పాల్గొంటున్నా మనం పతక బోణీ కొట్టింది మాత్రం 1928లో. ఆ ఏడాది అమెస్టర్‌డామ్ ఒలింపిక్స్‌లో హాకీలో మనకు స్వర్ణం లభించింది. అధికారికంగా మనకు ఇదే తొలి పతకం.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1948లో లండన్ ఒలింపిక్స్‌లోనూ హాకీలోనే భారత్ గోల్డ్ కొట్టింది. 1928 నుంచి 2008 బీజింగ్ ఒలింపిక్స్ దాకా మన పతకాల సంఖ్య 1, 2 వద్దే ఊగిసలాడేది. కానీ బీజింగ్‌లో 3 పతకాలు సాధించిన భారత్ 2012 లండన్‌లో 6 పతకాలు సాధించి దానిని కాస్త మెరుగుపరుచుకుంది. కానీ 2016 రియోలో మళ్లీ 2 పతకాలకే పరిమితమైంది. అయి తే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 7 పతకాలు సాధించడమే ఈ క్రీడల్లో భారత్‌కు ఇప్పటి వరకూ అత్యుత్తమ ప్రదర్శన.

పారిస్‌కు 113 మందిని పంపిన భారత్ ఖచ్చితంగా పతకాలు కొట్టగలమనే భావిస్తున్న వాటిలో షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, హాకీ, ఆర్చరీ, అథ్లెటిక్స్ (జావెలిన్ త్రో) ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ‘గోల్డెన్ త్రో’తో భారత క్రీడారంగంలో సంచలనంగా మారిన నీరజ్ చోప్రా మీద మరోసారి భారీ ఆశలున్నాయి. ఈసారి 90మీటర్ల మీద గురిపెట్టిన ఈ హర్యానా కుర్రాడు ఆ మేరకు పూర్తి సన్నద్ధమయ్యాడు. షూటింగ్లో మనూ బాకర్, సిఫ్ట్‌కౌర్ సమ్రా, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌పై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే ముగిసిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో మెరిసిన దీపికా కుమారి, ధీరజ్, జ్యోతి సురేఖ, తరుణ్‌దీప్ రాయ్ విశ్వక్రీడల్లో కొరియన్ల ధాటికి నిలబడగలరా? అనేది కీలకం. బాక్సింగ్‌లో నిఖత్, లవ్లీనా, అమిత్ పంగల్ పతక పంచ్ విసిరేందుకు సిద్ధమవుతున్నారు.

బ్యాడ్మింటన్‌లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు హ్యాట్రిక్ మెడల్‌పై గురిపెట్టగా ప్రణయ్, లక్ష్యసేన్ సైతం పోటీలో ఉన్నారు.గత రెండేండ్లుగా నిలకడగా ఆడుతున్న సాత్విక్-చిరాగ్ ద్వయంపైనా భారీ ఆశలున్నాయి. గతేడాది కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు ఈసారి పతకం రంగు మార్చాలని భావిస్తోంది. టేబుల్ టెన్నిస్‌లో వెటరన్ శరత్ కమల్, ఆకుల శ్రీజ, మనికా బత్రా పతకంపై ఆశలు రేపుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను మరోసారి భారత అభిమానుల పతక ఆశల బరువును మోసేందుకు సిద్ధమవుతోంది. భారత్ తప్పకుండా మూడు, నాలుగు పతకాలు ఆశిస్తున్న రెజ్లింగ్‌లో అంతిమ్ పంగల్, వినేశ్ ఫోగట్, అమన్ సెహ్రావత్, అన్షు మాలిక్ బృందం పతక పట్టు జారవిడవకుంటే భారత్ పంట పండినట్టే. వీరితో పాటు మిగిలిన క్రీడాకారులు తమ స్థాయికి మేర సత్తా చాటితే భారత్ కోరుకుంటున్న డబుల్ డిజిట్ పెద్ద కష్టమేమీ కాదు.

2030 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందని, అమెరికా, చైనా, జపాన్‌తో పోటీపడుతున్నామని చెప్పుకుంటున్నా క్రీడల్లో వాళ్లతో పోల్చితే మనం దారుణ స్థితిలో ఉన్నామన్నది కండ్ల ముందు కనబడుతున్న చేదు నిజం. అమెరికా ఇప్పటి దాకా గెలిచిన పతకాల సంఖ్య 2,985. ఆ జాబితాలో జర్మనీ (1,083), యూకే (965), ఫ్రాన్స్ (910), చైనా (713), జపాన్ (575) మనం కన్నెత్తి కూడా చూడని స్థాయిలో ఉన్నాయి. 124 ఏండ్లలో భారత్ సాధించిన పతకాలు 35 మాత్రమే. ఆర్థికంగా, జనాభాపరంగా, వనరుల పరంగా మనకంటే అత్యంత అధ్వాన స్థితిలో ఉన్న కెన్యా సాధించిన పతకాలు 113. జమైకా (88), ఇథియోపియా (58) వంటి దేశాలు మన కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నాయి.