పారిస్: భారత స్టార్ అథ్లెట్ నీరజ్‌చోప్రా మరోమారు సత్తాచాటాడు. పారిస్ వేదికగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ పోరులో నీరజ్ టైటిల్‌తో మెరిశాడు. గత రెండేండ్ల వ్యవధిలో నీరజ్‌కు ఇది తొలి (డైమండ్ లీగ్) టైటిల్ కావడం విశేషం. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో నీరజ్ 88.16మీటర్ల దూరంతో అగ్రస్థానంలో నిలిచాడు. తన తొలి ప్రయత్నంలోనే ఈ మార్క్ అందుకున్న నీరజ్ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. దోహాలో 90.23మీటర్ల మార్క్‌తో వ్యక్తిగత అత్యుత్తమ రికార్డు అందుకున్న నీరజ్ పారిస్‌లో లక్ష్యానికి సమీపంగా వచ్చినా 2 మీటర్ల దూరంలో ఆగిపోయాడు. అయితే 90 మీటర్ల మార్కును అందుకోకపోయినా డైమండ్ లీగ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
సరిగ్గా 8 ఏండ్ల క్రితం 84.67మీటర్లతో పారిస్‌లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన చోప్రా ఇన్నాళ్లకు అదే వేదికపై డైమండ్ లీగ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆది నుంచే అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ రెండో ప్రయత్నంలో 85.10మీటర్లు విసిరి ఆ తర్వాత వరుసగా మూడు ఫౌల్స్ చేశాడు. చివర్లో 82.89మీటర్లతో తన పోటీని చోప్రా ముగించాడు. ఇదే విభాగంలో పోటీపడ్డ జులియన్ వెబర్ (87.88మీ), లూయిజ్ మారిసియో (86.62మీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ ఈవెంట్‌కు ముందు నీరజ్‌కు ప్రధాన పోటీదారుగా భావించిన అండర్సన్ పీటర్స్(80.29మీ) ఐదో స్థానంతో నిరాశపరిచాడు. ఈనెల 24న చెక్‌రిపబ్లిక్ వేదికగా జరిగే ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు.