గుమి(దక్షిణకొరియా): ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల పతక ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందినితో పాటు హైజంపర్ పూజాసింగ్, లాంగ్‌డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్సింగ్ పసిడి పతకాలతో మెరిశారు. దీంతో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, మూడు కాంస్య పతకాలు చేరాయి. మహిళల హెప్టాథ్లాన్ ఈవెంట్లో నందిని 4500 పాయింట్లతో అగ్రస్థానంలో స్వర్ణ పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. లుయి జుంగ్యి(చైనా, 4210), కాయ్ జువాన్ చెన్(చైనీస్ తైపీ, 4193) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
ఏషియన్ అథ్లెటిక్స్ హెప్టాథ్లాన్‌లో స్వప్నా బర్మన్ (2017), సోమా బిశ్వాస్ (2005) తర్వాత స్వర్ణం గెలిచిన మూడో భారత అథ్లెట్‌గా నందిని అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎస్సీ గురుకులంలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న నందిని అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నది. పురుషుల 5000 మీటర్ల రేసును గుల్వీర్ 13:24:77సెకన్లలో పూర్తి చేసి పసిడి దక్కించుకున్నాడు. మహిళల హైజంప్‌లో పూజాసింగ్ 1.89మీటర్లతో స్వర్ణాన్ని ఒడిసిపట్టుకుంది.