Asia Cup | ఢిల్లీ: అసలే అంతంతమాత్రంగా ఉన్న భారత్, పాక్ క్రికెట్ సంబంధాలు రాబోయే రోజుల్లో మరింతగా క్షీణించనున్నాయా? ఇరుదేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలు, తాజా పరిణామాలు ఆ అనుమానాలను బలోపేతం చేస్తున్నాయి. దాయాదితో ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటాన్ని నిషేధించిన భారత క్రికెట్ జట్టు.. ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ వంటి టోర్నీలలో మాత్రమే పాక్‌తో క్రికెట్ ఆడుతున్నది. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో క్రికెట్‌కు పూర్తిగా స్వస్తి చెప్పేందుకు బీసీసీఐ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఐసీసీ కూడా ఈ విషయంపై పునరాలోచించాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది. ఇక ఈ ఏడాది భారత్, శ్రీలంకలో జరగాల్సి ఉన్న ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు తలపడేది కష్టమేనని సమాచారం.
టోర్నీలో పాకిస్థాన్ ఉండి ఆ జట్టుతో భారత్ మ్యాచ్ లు ఆడకుండా ఆసియా కప్‌ను నిర్వహించడం అసాధ్యం. అయితే పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్‌ను నిర్వహించాలని, ఆ దేశాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నుంచి బహిష్కరించాలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అలా జరగని పక్షంలో భారత్.. ఏసీసీ నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. తాజా పరిణామాలపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..‘ప్రస్తుతం భారత్-పాక్ సంబంధాలు సరిగ్గా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ (ఆసియా కప్) నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్నది. ఆసియా కప్ వాయి దా పడే అవకాశాలున్నాయి’ అని తెలిపారు.
బంగ్లా పర్యటనా డౌటే!
ఆసియా కప్ కంటే ముందే ఆగస్టులో బంగ్లాదేశ్‌కు వెళ్లనున్న భారత జట్టు ఆ పర్యటననూ రద్దు చేసుకోనున్నట్టు వార్తలొస్తున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన మేజర్ జనరల్ (రిటైర్డ్) ఫజ్లుర్ రెహ్మాన్ ఫేస్బుక్లో స్పందిస్తూ.. ‘ఒకవేళ భారత్.. పాకిస్థాన్‌పై దాడి చేస్తే మనం (బంగ్లాదేశ్) ఆ దేశంలోని ఈశాన్య రాష్ర్టాలను స్వాధీనం చేసుకోవాలి. చైనాతో కలిసి సంయుక్తంగా మిలిటరీ చర్య జరిపి వాటిని దక్కించుకోవాలి’ అని పోస్ట్ పెట్టడం వివాదాస్పదమైంది.