Asia Cup : ఆసియా కప్ పోటీలకు తటస్థ వేదికగా ఎంపికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఎండలు మండిపోనున్నాయి. ఎడారి దేశంలో అయినందున సెప్టెంబర్‌లో అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే ఎండవేడికి ఆటగాళ్లు చెమటలు కక్కాల్సిందే. ఉక్కపోత.. వేడి గాలుల తీవ్రతతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మెగా టోర్నీలో ఆటగాళ్లకు ఇలాంటి కష్టాలు రాకూడదని నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 19 లీగ్ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ ఫైట్ సమయంలోనూ మార్పులు చేశారు.
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా పదిహేడో సీజన్ ఆసియా కప్ షురూ కానుంది. అయితే.. ఈ నెల ప్రారంభం నుంచి అక్కడ పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని, సాయంత్రం 6 గంటల వరకూ ఎండ తీవ్రత కొనసాగనుందని స్థానిక వాతావరణ శాఖ చెబుతోంది. అంతటి ఎండలో మ్యాచ్‌లు అంటే ఆటగాళ్లు హడలెత్తిపోతారు. అందుకే.. బీసీసీఐతో పాటు శ్రీలంక, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ బోర్డులు మ్యాచ్‌ల సమయాన్ని మార్చాలని నిర్వాహకులను కోరాయి. ఆసియా దేశాల బోర్డుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన యూఏఈ క్రికెట్.. డే-నైట్ మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చింది.
🚨 𝐀𝐬𝐢𝐚 𝐂𝐮𝐩 𝐦𝐚𝐭𝐜𝐡 𝐭𝐢𝐦𝐢𝐧𝐠 𝐜𝐡𝐚𝐧𝐠𝐞𝐝!
18 of the 19 matches, including the final, to begin at 𝟔.𝟑𝟎 𝐏𝐌 local time (𝟖 𝐏𝐌 𝐈𝐒𝐓) pic.twitter.com/FBoY4doomL
— Cricbuzz (@cricbuzz) August 30, 2025
ముందుగా ప్రకటించిన సమయానికి అరగంట ఆలస్యంగా మ్యాచ్‌లు జరపాలని నిర్ణయించింది. అంటే.. సాయంత్రం 6:30 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు)లకు డై-నైట్ మ్యాచ్‌లు మొదలవుతాయి. ఇదే విషయాన్ని బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అయిన సోనీ స్పోర్ట్స్‌కు తెలియజేశారు నిర్వాహకులు. అయితే.. ఒకేఒక మ్యాచ్ సమయం మాత్రం మారలేదు. సెప్టెంబర్ 15న ఆతిథ్య యూఏఈ, ఒమన్ జట్లు పగటిపూటనే అబుదాబీలోని జయెద్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి.
ఆసియాకప్‌లో రెండు గ్రూపుల్లోని ఎనిమిది జట్లు కలిపి లీగ్ దశ.. సూపర్ 4 స్టేజ్ వరకూ 19 మ్యాచ్‌లు ఆడుతాయి. సెప్టెంబర్ 9న అఫ్గనిస్థాన్, హాంకాంగ్ మధ్య ఆరంభ పోరు జరుగనుంది. మరుసటి రోజు భారత జట్టు, ఆతిథ్య యూఏఈని ఢీకొట్టనుంది. ఇప్పటివరకూ 8 పర్యాయాలు (ఏడుసార్లు వన్డే ఫార్మాట్, ఒకసారి టీ20 ఫార్మాట్) ఈ మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా. బ్యాటింగ్ యూనిట్ నిండా విధ్వంసక హిట్టర్లే ఉండడంతో మరోసారి టైటిల్‌తో మురిసిపోవాలనే పట్టుదలతో ఉంది సూర్యకుమార్ యాదవ్ బృందం. దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అబుదాబీలోని షేక్ జయెద్ స్టేడియంలో ఆసియా కప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.