Asia Cup 2025 | తాను బీసీసీఐకి ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపారు. యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఓడించి టీమిండియా టైటిల్‌ను గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ట్రోఫీ విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు నఖ్వీ నుంచి ట్రోఫీ, మెడల్స్‌ను తీసుకునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత నఖ్వీ ట్రోఫీని తీసుకొని వెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు. దాంతో నఖ్వీ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఏసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ వ్యవహరించిన తీరుపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ట్రోఫీ భారత్‌కు అప్పగించకపోవడంతోపై బీసీసీఐ మండిపడింది. అలా ఆపేందుకు ఆయనకు ఎలాంటి హక్కు లేదనంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భేటీలో బీసీసీఐకి నఖ్వీ క్షమాపణలు చెప్పాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన మాట్లాడుతూ క్షమాపణలు చెప్పినట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తాను బీసీసీఐకి ఎలాంటి క్షమాపణలు చెప్పలేదని.. ఎప్పటికీ అలా చేయబోనని.. భారత మీడియా వాస్తవాలతో కాకుండా అబద్ధాలతోనే వృద్ధి చెందుతుందంటూ ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఏసీసీ అధ్యక్షుడిగా ట్రోఫీని అందించేందుకు ఆ రోజున సిద్ధంగానే ఉన్నానని.. ఇప్పటికీ కూడా ఈ విషయంలో సిద్ధంగానే ఉన్నానన్నారు. నిజంగా కోరుకుంటే ఏసీసీ కార్యాలయానికి వచ్చి నా వద్ద నుంచి ట్రోఫీని తీసుకోవచ్చంటూ మరోసారి పేర్కొన్నారు.