ఢాకా : ఆసియా కప్ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి వీడింది. ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నప్పటికీ.. ఈ టోర్నీని తటస్థ వేదికపై నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు గురువారం ఢాకాలో నిర్వహించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో ఇందుకు సంబంధించిన చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ఈ మీటింగ్‌కు బీసీసీఐ నుంచి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వర్చువల్‌గా హాజరయ్యారు.
‘ఆసియా కప్‌ను యూఏఈలో నిర్వహిస్తాం. భారత్, పాక్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరుగుతాయి’ అని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. టీ20 ఫార్మాట్లో జరుగనున్న ఈ టోర్నీ.. సెప్టెంబర్ రెండో వారంలో మొదలై ఆ మాసాంతం వరకూ జరుగనుంది. పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఏసీసీ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ మీటింగ్ అనంతరం తెలిపారు.