IND vs PAK Final | ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ ఫైనల్లో తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్వింగ్ ఆఫ్ సుల్తాన్‌గా పేరొందిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ఈ మ్యాచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్, జట్టు కలయిక దృష్ట్యా.. టైటిల్‌ను గెలవడానికి టీమిండియా బలమైన పోటీదారుగా అక్రమ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇది భారత్-పాక్ మధ్య మ్యాచ్ అని.. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలింగ్ ప్రభావవంతంగానే ఉంటుందని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరేట్ అని పేర్కొన్నాడు. సూపర్ ఫోర్లో బంగ్లాదేశ్‌పై 136 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించి పాక్ ఫైనల్‌కు చేరింది.
ఈ విజయం పాక్ జట్టులో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్న అక్రమ్.. ఫైనల్లో ఇదే ఊపును కొనసాగించడం ముఖ్యమన్నారు. పాకిస్తాన్ జట్టు ఆదివారం ఈ ఆత్మవిశ్వాసాన్ని, ఈ ఊపును కొనసాగించాలని.. ఈ మ్యాచ్‌లో తెలివిగా ఆడాలని సూచించాడు. కీలక మ్యాచ్‌లో మానసిక బలం ముఖ్యమని.. ఆటగాళ్లు ఒత్తిడిలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ల వికెట్లు తీయడం చాలా ముఖయమని.. ముఖ్యంగా అభిషేక్, గిల్ వికెట్లను తీయాలని చెప్పాడు. తొలి ఓవర్లలోనే కొన్ని వికెట్లను తీయడం వల్ల భారత్ ఖచ్చితంగా ఒత్తిడిలో పడుతుందని తెలిపాడు. సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ 105 పరుగుల భాగస్వామ్యంతో పాకిస్థాన్‌ను మ్యాచ్ నుంచి దూరం చేసిందని గుర్తు చేశాడు.
అందుకే ఈ ఇద్దరిని ఆపేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఒక అద్భుతమైన ఇన్నింగ్, బౌలింగ్ స్పెల్ మ్యాచ్‌ను మలుపు తిప్పగలదని వసీం అక్రమ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చని.. మంచి ఇన్నింగ్స్, మంచి స్పెల్ మ్యాచ్ గమనాన్ని గలవని.. కానీ మ్యాచ్‌లో గట్టి పోటీ ఉండాలని.. చివరికి ఉత్తమ జట్టు గెలుస్తుందని ఆశిస్తున్నట్లు అక్రమ్ తెలిపాడు. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్-పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ అద్భుత పోరు కోసం అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. భారత జట్టు నిలకడగా అద్భుతంగా ప్రదర్శన ఇస్తున్నది. పాక్ మాత్రం తడబడుతున్నది. ఈ మ్యాచ్‌లో అభిమానులకు చిరస్మరణీయంగా మిగలనున్నది.