Kohli Retirement : సుదీర్ఘ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) వైదొలగడం అభిమానులకే కాదు మాజీలకు నమ్మశక్యం కావడం లేదు. అందుకు కారణం ఫిట్నెస్ ఫ్రీక్ అయిన విరాట్‌కు ఇంకా 36 ఏళ్లే. గాయాలకు అతడు ఆమడ దూరం. పైగా ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. కానీ, రన్ మెషీన్ మాత్రం రోహిత్ శర్మను అనుసరిస్తూ రిటైర్మెంట్ నిర్ణయానికే మొగ్గు చూపాడు. ఆటగాడిగా.. కెప్టెన్‌గా టెస్టు క్రికెట్ గమనాన్ని మార్చేసిన కోహ్లీ ఉన్నపళంగా రెడ్ బాల్‌కు గుడ్ బై చెప్పడం తనను విస్మయానికి గురి చేసిందని రవిచంద్రన్ అశ్విన్(R Ashwin) అంటున్నాడు.
కోహ్లీ టెస్టు రిటైర్మెంట్పై అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు. ఈ సందర్బంగా కోహ్లీతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఈ మాజీ స్పిన్నర్.. విరాట్‌ను అలుపెరగని యోధుడిగా ప్రశంసించాడు. ‘నేను చూసిన గొప్ప ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. బ్యాటింగ్, కెప్టెన్సీ, ఫీల్డింగ్.. ఏదైనా సరే అలుపెరగని ఉత్సాహమే అతడిని అత్యుత్తమ ఆటగాడిని చేసింది. అతడు ఓటమిని ఒప్పుకోనీ పోటీదారుడు. అందుకే కొన్నిసార్లు విరాట్‌ను నువ్వు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తిన్నావు? అని అడిగేవాన్ని.
నా దృష్టిలో కోహ్లీలో పరుగుల దాహం ఉంది. ఇంకో రెండేళ్లు టెస్టులు ఆడగల సత్తా కోహ్లీలో ఉంది. కానీ, ఉన్నట్టుండి అతడు వీడ్కోలు నిర్ణయం తీసుకున్నాడు. కరోనా ముందు 50కి పైనా ఉన్న అతడి సగటు ఇప్పుడు 46కు చేరింది. మునపటిలా తాను మానసికంగా సన్నద్ధంగా లేకపోవచ్చు. బహుశా అందుకే కోహ్లీ టెస్టులకు అల్విదా పలికాడని అనుకుంటున్నా’ అని అశ్విన్ వెల్లడించాడు.
భారత జట్టు గొప్ప ఆటగాళ్లలో ముందువరుసలో ఉండే కోహ్లీ 123 టెస్టుల్లో 9,230 పరుగులు సాధించాడు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ సారథ్యంలోనే టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ముఖ్యంగా 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక సిరీస్ విజయంలో విరాట్ పాత్ర మరువలేనిది. మైదానంలో చిరుతను తలపించే కోహ్లీ.. ప్రత్యర్థులు కవ్విస్తే మరింత రెచ్చిపోతాడు. అందుకే.. అతడిని స్లెడ్జింగ్ చేసేందుకు కంగారు క్రికెటర్లు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు.
Illustrious legacy 🇮🇳
Inspiring intensity 👏
Incredible icon ❤️The Former #TeamIndia Captain gave it all to Test Cricket 🙌
Thank you for the memories in whites, Virat Kohli 🫡#ViratKohli | @imVkohli pic.twitter.com/febCkcFhoC
— BCCI (@BCCI) May 12, 2025