Yamini Rangan | ఇటీవల కాలంలో పనిగంటలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్ ఫౌండర్ వారానికి 70 గంటలు పని చేయాలని, ఎల్అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ వారానికి 90 గంటలు పనిచేయాలంటూ అని సంచలన వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు. అయితే, వారిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ సంస్థ హబ్స్పాట్ సీఈఓ, భారత సంతతికి చెందిన యామిని రంగన్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామందికి ఆదివారం వస్తుందంటే సోమవారం గురించి ఆందోళన మొదలవుతుందని.. తనకు ఆదివారాలంటే భయం లేదన్నారు. దాన్ని తాను ఆస్వాదిస్తానని.. ఎందుకంటే అది నా సమయం అంటూ ‘ది గ్రిట్’ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు.
ఆ రోజు ఎలాంటి అంతరాయాలు, సమావేశాలు లేకుండా పూర్తి ఏకాగ్రతతో లోతైన ఆలోచనలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, వ్యూహరచన చేయడం, రావడంపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఇది తన సృజనాత్మకతకు, దీర్ఘకాలిక ప్రణాళిక ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఆమె శుక్ర, శనివారాలు పనికి, ఆఫీసు ఆలోచనలకు దూరంగా ఉంటానన్నారు. ఈ సమయంలో కుటుంబీకులతో గడపడం, ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం వంటివి చేస్తుంటానన్నారు. గతంలో సరైన విరామం తీసుకోలేని సమయంలో పూర్తిగా అలసిపోయేదాన్నని.. ప్రస్తుతం రెండురోజుల విశ్రాంతి కారణంగా రీచార్జ్ అవుతున్నట్లు అనిపిస్తుందన్నారు. అయితే, ఆదివారం పని విధానంతో టీమ్‌లోని సభ్యుల వారాంతలపు విశ్రాంతికి ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకుంటానన్నారు. వారికి పంపాల్సిన ఈ మెయిల్స్ సోమవారం ఉదయమే చేరేలా ముందస్తుగా షెడ్యూల్ చేస్తానని చెప్పారు. యామిని రంగన్ సాధారణంగా వారపు రోజుల్లో ఉదయం 6.30 గంటలకు తన పనిని ప్రారంభిస్తారు.
అది కొన్నిసార్లు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. తీవ్రమైన పని ఒత్తిడిని తట్టుకునేందుకు, ఉన్నతస్థాయిలో పనితీరు కనబరచడానికి తన వారాంతపు ప్రణాళిక ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొన్నారు. గరిష్ఠ స్థాయిలో పని చేయాలంటే, గరిష్ఠ స్థాయిలో విశ్రాంతి అవసరమేనన్నారు. ఇదిలా ఉండగా.. 34 బిలియన్ల మార్కెట్ విలువ ఉన్న హబ్‌స్పాట్‌కు యామిని సీఈవోగా కొనసాగుతున్నారు. ఆమె 2024 ఆర్థిక సంవత్సరంలో 25.88 మిలియన్ల వేతనం అందుకున్నారు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.215 కోట్లు. ఆమెకు టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం ఉంది. ఆమె కోయంబత్తూరులోని భారతియార్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్‌లో బ్యాలర్ డిగ్రీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ నుంచి మాస్టర్స్ డిగ్రీతో పాటు ఎంబీఏ పట్టా అందుకున్నారు.