హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో నూతన అధ్యాయానికి నాంది పడింది. ఇన్నాళ్లు అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు, నిధుల గోల్‌మాల్‌తో మసకబారిన హెచ్‌సీఏ ప్రతిష్ఠను తిరిగి పునరుద్ధరించేందుకు సమయం రానే వచ్చింది. తమ ప్రాబల్యంతో హెచ్‌సీఏలో పాతుకుపోయిన పాతకాపులకు.. తెలంగాణ ఉద్యమకారుడు, విద్యావేత్త అర్సనపల్లి జగన్మోహన్రావు తనదైన రీతిలో చెక్ పెట్టాడు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా పోటీకి దిగిన తొలిసారే తన సత్తాఏంటో ప్రత్యర్థులకు రుచిచూపుతూ దిమ్మతిరిగే రీతిలో హెచ్‌సీఏపై తెలంగాణ జెండాను సగర్వంగా రెపరెపలాడించాడు. ప్రభుత్వ పెద్దల మద్దతుతో ప్రత్యర్థులను మట్టికరిపించిన జగన్ హెచ్‌సీఏలో జయకేతనం ఎగురవేశాడు. హెచ్‌సీఏ తెలంగాణ సొత్తు అని ప్రకటించిన ఆయన ఈ విజయం రాష్ట్ర ప్రజలకు అంకితమన్నారు. ఈ విజయానికి సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో అర్శనపల్లి జగన్మోహన్రావు జయకేతనం ఎగురవేశారు. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో జగన్(63) ఒక్క ఓటు తేడాతో సమీప అభ్యర్థి అమర్నాథ్(62)పై అద్భుత విజయం సాధించారు. నువ్వానేనా అన్నట్లు కొనసాగిన అధ్యక్ష పోరులో ఆఖరికి జగన్నే విజయం వరించింది. శుక్రవారం ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా హెచ్‌సీఏ పాలకవర్గానికి ఎన్నికలు జరిగాయి. జాతీయ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోల్ అయ్యాయి. మాజీ క్రికెటర్లు సాండ్రా బ్రెగెంజా, డయానా డేవిడ్, జతిన్ మెహతా (ఎయిర్ ఇండియా), వినోద్ గైర్హజయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పలువురు మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ప్రజ్ఞాన్ ఓఝా, మిథాలీరాజ్ తమ ఓటు హక్కు వినియోగించారు. సాయంత్రం నాలుగు గంటలకు తొలుత కౌన్సిలర్ బెర్తుతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.
క్రికెట్ ఫస్ట్ ప్యానెల్‌కు చెందిన సునీల్‌కుమార్ అగర్వాల్ 59 ఓట్లతో విజయం సాధించగా, యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ అభ్యర్థి అన్సార్ అహ్మద్(50) రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జరిగిన కోశాధికారి పదవి కోసం యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏకు చెందిన సీజే శ్రీనివాసరావు 66 ఓట్లతో అగ్రస్థానంలో నిలువగా, సంజీవ్‌రెడ్డి(33) రెండో స్థానానికి పరిమితమయ్యాడు. సంయుక్త కార్యదర్శి పదవికి పోటీలో గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కు చెందిన బసవరాజు(60) ఒక్క ఓటు తేడాతో చిట్టి శ్రీధర్(క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)పై ఉత్కంఠ విజయం సాధించాడు. కార్యదర్శి పదవి..క్రికెట్ ఫస్ట్ ప్యానెల్ అభ్యర్థి దేవరాజ్(77)..హరి నారాయణ(49, యెనైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ)పై గెలిచాడు. ఉపాధ్యక్ష పదవి గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కు చెందిన దల్జీత్‌సింగ్(63) దక్కగా, శ్రీనివాస్(46) రెండో స్థానంలో నిలిచారు. మొత్తంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలో హెచ్‌సీఏ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బహుళ క్లబ్‌ల ప్రాతినిధ్యానికి చరమగీతం పాడుతూ 57 క్లబ్‌లపై మూడేండ్ల పాటు నిషేధం విధించారు. దీంతో ఇన్నాళ్లు హెచ్‌సీఏను జలగల్లా పట్టిపీడించిన కొన్ని వర్గాలకు అధికారం అందకుండా పోయింది.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన సోదరుడు జగన్మోహన్రావుకు శుభాకాంక్షలు. గ్రామీణ క్రికెట్ అభివృద్ధిపై దృష్టి పెడుతూ పదవీకాలం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.
– కవిత , ఎమ్మెల్సీ
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్రావుకు అభినందనలు. మీ హయంలో మరిన్ని విజయాలు సాధించాలి. రానున్న భవిష్యత్‌లో ప్రతిభ కల్గిన యువకులకు క్రికెట్ కెరీర్‌గా మారాలి.
– హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి
అభిమానుల సంబురాలు
ఉప్పల్ స్టేడియంలో సంబురాలు అంబరాన్నంటాయి. జగన్మోహన్రావు అధ్యక్ష పీఠం దక్కించుకోగానే అభిమానులు పెద్దఎత్తున సంబురాల్లో మునిగి తేలారు. పోటీపడ్డ తొలిసారే ప్రతిష్ఠాత్మక పదవి సొంతం చేసుకోవడంపై ఫ్యాన్స్ ఈలలు, కేరింతలతో దుమ్మురేపారు. పటాకులు పేలుస్తూ డీజే చప్పుళ్ల మధ్య జగన్‌ను భుజాలపై ఎత్తుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అభినందనల వెల్లువ
హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జగన్ ఎన్నిక కాగానే పలువురు ప్రముఖలు అభినందనల్లో ముంచెత్తారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, సినీ నటుడు సోనూసూద్‌తో పాటు పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ విజయం తెలంగాణకు అంకితం. ఈ విజయంలో వెన్నంటి నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు లభించింది. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితకు ఈ గెలుపును అంకితం చేస్తున్నాను. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తాను. గ్రామీణ ప్రాంత క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటాం. ప్రభుత్వ మద్దతుతో దేశంలో హెచ్‌సీఏను అత్యుత్తమ క్రికెట్ అసోసియేషన్‌గా తీర్చిదిద్దుతాం.
-జగన్ మోహన్ రావు
హెచ్‌సీఏ కొత్త కార్యవర్గం
అధ్యక్షుడు ; జగన్మోహన్రావు
ఉపాధ్యక్షుడు ; దల్జీత్‌సింగ్
కార్యదర్శి ; దేవరాజ్
సంయుక్త కార్యదర్శి ; బసవరాజు
కోశాధికారి ; శ్రీనివాసరావు
కౌన్సిలర్ ; సునీల్‌కుమార్