Arjun Tendulkar : దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వారసుడిగా మనందరికి తెలిసిన అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) బంతితో నిప్పులు చెరిగాడు. టీమిండియా జెర్సీ కలను నిజం చేసుకునే పనిలో మరో ముందడుగు వేస్తూ.. రంజీల్లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా తండ్రికి సాధ్యం కాని రికార్డు సొంతం చేసుకున్నాడు.
ముంబైని వీడి గోవా జట్టు తరఫున ఆడుతున్న అర్జున్ రంజీ సీజన్లో సత్తా చాటాడు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)తో జరిగిన మ్యాచ్‌లో ఈ పొడగరి పేసర్ విజృంభించాడు. బుల్లెట్ బంతులతో బ్యాటర్లను వణికిస్తూ 9 ఓవర్లలో 5 వికెట్లు పడగొట్టాడు. అర్జున్ విజృంభణతో అరుణాచల్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే ఆలౌట్ అయింది.
Ranji Trophy 2024-25: OMG! Arjun achieves the feat that Sachin Tendulkar couldn’t, find out#RanjiTrophy2024_25 #ArjunTendulkar #SachinTendulkar
For more details 👇https://t.co/J3p8NL5Wdi pic.twitter.com/9NSrgm9gKp
— XtraTime (@xtratimeindia) November 13, 2024
లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన అర్జున్ టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్‌కు పెద్ద షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే కెప్టెన్ నబమ్ హచంగ్ను బౌల్డ్ చేసి గోవాకు బ్రేకిచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే మరో ఓపెనర్ నీలమ్ ఓబీని అర్జున్ పెవిలియన్ పంపాడు. దాంతో, అరుణాచల్ ప్రదేశ్ జట్టు 26 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.
ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన అర్జున్ జయ్ భవ్సర్ను ఎల్బీగా వెనక్కి పంపి ప్రత్యర్థిని కోలులోలేని దెబ్బకొట్టాడు. మొజి ఏట్స్ను ఔట్ చేసిన అర్జున్ రంజీల్లో మొదటిసారి ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు. తద్వారా రంజీ ట్రోఫీలో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 26/5తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబై జట్టుకు ఆడాలనుకున్న అర్జున్‌కు అక్కడ గట్టి పోటీ ఎదురైంది. దాంతో, తండ్రి సచిన్ సలహా మేరకు అతడు గోవాకు మారాడు. ఫస్ట్ క్లాస్‌లో గోవా తరఫున నిలకడగా రాణిస్తూ తుది జట్టులో చోటు దక్కించుకుంటున్నాడు. ఈ సీజన్లో సిక్కింపై 6/112తో రాణించిన అర్జున్ అనంతరం 42 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఇప్పటివరకూ అర్జున్ కేవలం 4 మ్యాచుల్లోనే 16 వికెట్లతో వారెవ్వా అనిపించాడు. అత్యధిక వికెట్లు తీసిన మూడో గోవా పేసర్‌గా నిలిచాడు.