ముంబై: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత మహిళా క్రికెట్ జట్టులో యువ ఆల్‌రౌండర్ అనుష్క శర్మకు తొలిసారిగా చోటు దక్కింది. కొద్దిరోజుల క్రితమే ముగిసిన డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్ తరఫున రాణించిన 22 ఏండ్ల ఈ మధ్యప్రదేశ్ అమ్మాయితో పాటు పేసర్ కాశ్వీ గౌతమ్, వికెట్‌కీపర్ బ్యాటర్ ఉమా ఛెత్రి జట్టులోకి వచ్చారు.
ఈ మేరకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ మంగళవారం వెల్లడించింది. స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, జి. కమిలిని, అమన్‌జోత్ కౌర్‌పై వేటు పడింది. వచ్చే నెల 17 నుంచి 27 మధ్య ఉమెన్ ఇన్ బ్లూ.. సఫారీలతో ఐదు టీ20లు ఆడనుంది. వచ్చే జూన్‌లో ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌నకు ఇది సన్నాహకంగా ఉపయోగపడనుంది.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షెఫాలీ, జెమీమా, దీప్తి, రిచా, అరుంధతి, రేణుకా, క్రాంతి, శ్రీచరణి, శ్రేయాంక, కాశ్వీ, ఫల్మలి, ఉమా, అనుష్క