Andre Russell : ప్రపంచంలోని విధ్వంసక ఆల్రౌండర్లలో ఆండ్రూ రస్సెల్(Andre Russell) ఒకడు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల రస్సెల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వెస్టిండీస్ బోర్డుతో విభేదాల కారణంగా జట్టుకు దూరమైన అతడికి ఊహించనివిధంగా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్(England)తో సొంతగడ్డపై జరిగే 5 మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌కు ఎంపిక చేసిన స్క్వాడ్‌లో రస్సెల్ చోటు దక్కించుకున్నాడు. దాంతో, రెండేండ్ల తర్వాత రస్సెల్ మళ్లీ వెస్టిండీస్ జెర్సీ వేసుకోబోతున్నాడు.
ఈ ఆల్‌రౌండర్ చివరిసారిగా 2021 వరల్డ్ కప్(T20 World Cup)లో దేశం తరఫున ఆడాడు. వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే పొట్టి ప్రపంచకప్ పోటీలకు సన్నాహాల్లో భాగంగానే సెలెక్టర్లు రస్సెల్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. రస్సెల్‌తో పాటు యువ ఆల్‌రౌండర్ మాథ్యూ ఫొర్డే, జేసన్ హోల్డర్, నికోలస్ పూరన్, కైలి మేయర్స్లు కూడా టీ20 స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.
Squad revealed for West Indies T2️⃣ 0️⃣I Series vs England🏏🌴#WIHomeforChristmas #WIvENG pic.twitter.com/b5Cs9wYeC7
— Windies Cricket (@windiescricket) December 9, 2023
టీ20 స్క్వాడ్ : రొవ్మన్ పావెల్(కెప్టెన్), షై హోప్(వైస్ కెప్టెన్), రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫొర్డే, షిమ్రాన్ హిట్మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రూ రస్సెల్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రొమారియో షెఫర్డ్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రస్సెల్ గత కొన్నాళ్లుగా కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే.. ఈ స్టార్ ఆల్‌రౌండర్ 16వ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ కోల్‌కతా అతడిని 2024 ఎడిషన్ కోసం అట్టిపెట్టుకుంది. ఒకదశలో రస్సెల్‌ను వదిలించుకోవాలని కోల్‌కతా అనుకుంది. అయితే.. ఈమధ్యే ఫ్రాంచైజీ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ కెప్టెన్ గౌతం గంభీర్(Gautam Gambhir) యాజమాన్యానికి నచ్చజెప్పాడు. దాంతో, అతడిపాటు సునీల్ నరైన్‌ను కూడా కోల్‌కతా రీటైన్ చేసుకుంది.