న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు ఇంకా తెరపడటం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా తాము పాకిస్థాన్లో పర్యటించలేమని బీసీసీఐ పేర్కొన్న నేపథ్యంలో ఐసీసీ సంప్రదింపులకు దిగింది. హైబ్రిడ్ పద్ధతిలో టోర్నీని నిర్వహించలేమన్న పీసీబీ ప్రకటనతో ఐసీసీ తీసుకునే చర్యలపై ఆసక్తి నెలకొన్నది. పాక్ నుంచి పూర్తిగా తప్పిస్తూ దక్షిణాఫ్రికాలో టోర్నీ నిర్వహించే అవకాశముందని వార్తలు వచ్చాయి.
తొలి రౌండ్లోనే ఇంటిబాట
కుమమొటొ(జపాన్): భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ద్వయం త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్.. కుమమొటొ మాస్టర్స్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్-32లో త్రిసా-గాయత్రి జంట.. 16-21, 16-21తో హు యిన్ హుయ్ – లిన్ యిన్ హుయ్ (చైనీస్ తైఫీ) చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రత్యర్థి జోరుతో భారత ద్వయం ఆట 36 నిమిషాల్లోనే ముగిసింది. ఈ టోర్నీలో బుధవారం స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ బరిలోకి దిగనున్నారు.