Aman Sehrawat : ఒలింపిక్స్ పతకం ప్రతి అథ్లెట్ కల. విశ్వ క్రీడల మెడల్ మెడలో పడిన రోజున క్రీడాకారుల ఆనందానికి హద్దే ఉండదనుకో. దేశం తరపున పతకం గెలిచిన క్షణం నుంచే వాళ్ల జీవితం మారిపోతోంది. అప్పటిదాకా వాళ్లు పడిన కష్టాలు ఒక్కసారిగా కనుమరుగవుతాయి. భారత యవ రెజ్లర్ అమన్ సెహ్రావత్ (Aman Sehrawat) విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఒకప్పుడు తిండికోసం, రెజ్లింగ్ శిక్షణ కోసం ఎంతో కష్టపడిన అమన్.. ఇప్పుడు పెద్ద మొత్తంలో కానుకలు, సత్కారాలు అందుకుంటున్నాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్యను ఆరుకు పెంచిన అమన్ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. కుస్తీ పోటీల్లో ఆరితేరిన అతడి జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలే. రెజ్లింగ్ వైపు అడుగు వేసిన సమయంలోనే కన్నవాళ్లను కోల్పోయిన అమన్.. మూడు పూటలా తిండికోసం ఏన్నో ఇబ్బందులు పడ్డాడు. ‘కొన్నిసార్లు తిండికి, శిక్షణకు పైసలు ఉండేవి కావు.
ఆ కష్ట కాలమే నన్ను ఎంతో బలంగా మార్చింది. అప్పుడు ఒలింపిక్ పతకం గెలిస్తే నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుదని నాకు అనిపించింది. అందుకని విశ్వ క్రీడల్లో పోడియం మీద నిల్చోవడమే లక్ష్యంగా పగలూ, రాత్రీ కుస్తీ పట్టేవాడిని’ అని అమన్ తెలిపాడు.
అంతేకాదు ఒలింపిక్ విజేతగా తనకు దక్కిన గౌరవ మర్యాదలు చూసి ఆశ్చర్యపోయానని ఈ యువకెరటం అన్నాడు. ‘విమానాశ్రయంలో నాకు స్వాగతం పలికేందుకు చాలామంది వచ్చారు. ఛత్రసాల్‌లో ప్రతిఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొందరైతే జోష్‌గా డాన్స్‌లు చేశారు. ఒలింపిక్ పతకం సాధిస్తే దేశ ప్రజలు ఈ తరహాలో ఆనందిస్తారని నేను ఊహించలేదు’ అని అమన్ వెల్లడించాడు.
21 ఏండ్లకే ఒలింపిక్ పతకం కలను నిజం చేసుకున్న అమన్ భావి రెజ్లర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అరంగేట్ర విశ్వ క్రీడల్లోనే మెడల్ కొల్లగొట్టిన ఈ యువ రెజ్లర్ ప్రమోషన్ సాధించాడు. ఉత్తర భారత రైల్వేస్ (Northern Railways) అతడిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా(ఓఎస్డీ) ప్రమోట్ చేసింది.
ఒలింపిక్ ట్రయల్స్‌లో టోక్యోలో రజతం గెలిచిన రవి దహియా(Ravi Dahiya)ను మట్టికరిపించిన అమన్.. పారిస్‌లో పతకంతో మెరిశాడు. 57 కిలోల విభాగంలో తన ఉడుంపట్టుతో దేశానికి ఐదో కాంస్యం అందించాడు. 10 గంటల్లోనే 4.6 కిలోలు తగ్గిన అమన్ పతకంతో గర్జించాడు. దాంతో, 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ప్రతిసారి విశ్వ క్రీడల్లో రెజ్లర్లు పతకాలు సాధిస్తున్న ఆనవాయితీని అమన్ కొనసాగించాడు.