IPL | ఐపీఎల్లో లక్నోసూపర్ జెయింట్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. లక్ష్యం ఎంత చిన్నదైనా తమ బౌలింగ్ దళంతో లక్నో ప్రత్యర్థి భరతం పడుతున్నది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో సమిష్టి ప్రదర్శన కనబరిచిన లక్నో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నిర్దేశిత లక్ష్యఛేదనలో యువ పేసర్ యశ్ ఠాకూర్ ఐదు వికెట్ల విజృంభణతో గుజరాత్ కుప్పకూలింది. సాయిసుదర్శన్, తెవాటియా ఆకట్టుకున్నారు. తొలుత స్టొయినిస్ అర్ధసెంచరీకి తోడు రాహుల్, పూరన్ రాణింపుతో లక్నో 163 స్కోరు చేసింది.
లక్నో: ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట స్టొయినిస్(58), రాహుల్(33), నికోలస్ పూరన్(32 నాటౌట్) రాణించడంతో లక్నో 163/5 స్కోరు చేసింది. ఉమేశ్‌యాదవ్(2/22), దర్శన నల్కందే(2/21) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో గుజరాత్ 18.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. సాయిసుదర్శన్(31), తెవాటియా(30) ఆకట్టుకున్నారు. యశ్ ఠాకూర్(5/30) ఐదు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు. కృనాల్ పాండ్యా(3/11) కీలక వికెట్లు తీశాడు. ఐదు వికెట్లతో జట్టు విజయంలో కీలకమైన యశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
యశ్ విజృంభణ:
నిర్దేశిత లక్ష్యఛేదనలో గుజరాత్‌కు ఓపెనర్లు సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్(19) మెరుగైన శుభారంభం అందించారు. లక్నో బౌలర్ల సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టడంతో గిల్ వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. ఒకానొక దశలో గుజరాత్ సాఫీగా సాగుతున్న సమయంలో యశ్ గిల్ ఔట్‌తో వికెట్ల వేటకు తెరతీశాడు. వైవిధ్యమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను యశ్ ముప్పుతిప్పలు పెట్టాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు రవి బిష్ణోయ్, కృనానల్ పాండ్యా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో విలియమ్సన్ (1), సుదర్శన్, శరత్(2), దర్శన్ (12) వికెట్లు కోల్పోయింది. దీంతో 80 పరుగులకే టైటాన్స్ సగం వికెట్లు చేజార్చుకుంది. ఒకే ఓవర్లో శంకర్ (17), రషీద్‌ఖాన్(0)ను యశ్ పెవిలియన్ పంపాడు. అదే దూకుడు కనబరుస్తూ తన ఆఖరి ఓవర్లో తెవాటియా, నూర్ అహ్మద్ (4) వికెట్లు తీసిన యశ్..లక్నోకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో యశ్ తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 163/5(స్టొయినిస్ 58, రాహుల్ 33, నల్కందే 2/21, ఉమేశ్‌యాదవ్ 2/22), గుజరాత్: 18.5 ఓవర్లలో 130 ఆలౌట్(సుదర్శన్ 31, తెవాటియా 30, యశ్ 5/30, కృనాల్ 3/11)