బర్మింగ్‌హామ్ : బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్స్ – 2025కు వేళైంది. మంగళవారం నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ఈ టోర్నీకి తెరలేవనుంది. 1980లో ప్రకాశ్ పదుకునే, 2001లో పుల్లెల గోపీచంద్ చరిత్రాత్మక విజయాల తర్వాత ఈ టోర్నీలో భారత్ ఇప్పటిదాకా ఏ విభాగంలోనూ టైటిల్ గెలవలేదు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్యసేన్ తుది మెట్టు వరకూ వెళ్లినా ఆఖర్లో తడబాటుకు గురై రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. ఈ ఏడాది పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ బరిలో ఉండగా మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, మాళవిక బన్సోద్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ ద్వయం పునరాగమనం చేయనుండగా మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్, అశ్విని – తనీషా, ప్రియా-శృతి బరిలో ఉన్నారు. గాయాలు, విరామాల తర్వాత ఈ టోర్నీ ఆడనున్న భారత షట్లర్లు ఏ మేరకు సత్తా చాటుతారనేది ఆసక్తికరం.