Monte Carlo Masters : టెన్నిస్ యువకెరటం కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) మరో టైటిల్ కొల్లగొట్టాడు. మొనాకోలో జరిగిన మాంటే కార్లో మాస్టర్స్(Monte Carlo Masters)లో దుమ్మురేపిన ఈ టాప్ సీడ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఇటలీకి చెందిన లొరెంజో ముసెట్టి(Lorenzo Musetti)ని చిత్తుగా ఓడించాడు.
తొలి సెట్ కోల్పోయిన అల్కరాజ్.. ఛాంపియన్ ఆటతో ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. వరుసగా రెండు సెట్లు గెలుపొంది ట్రోఫీని ముద్దాడాడు. దాంతో, ఆరోసారి ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడీ స్పెయిన్ స్టార్. గత ఏడాది ఇండియన్ వెల్స్ మాస్టర్స్ ట్రోఫీ తర్వాత అల్కరాజ్కు ఇదే గర్వించదగ్గ విజయం కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. గ్రాండ్స్లామ్స్తో కలిపి ఇది అతడికి 18వ టైటిల్.
First win in Monte-Carlo: 2025 ✅
First title in Monte-Carlo: 2025 🏆A week of firsts for @carlosalcaraz 👏 pic.twitter.com/grmI8TFTdq
— Tennis TV (@TennisTV) April 13, 2025
మాంటే కార్లో మాస్టర్స్ టైటిల్ గెలుపొందాక అల్కరాజ్ ఆనందంలో మునిగిపోయాడు. ఈ విజయం తనకు ఎంతో గర్వకారణమని చెప్పాడు. ‘ఈ వారం నాకు చాలా కష్టంగా తోచింది. చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. ఫైనల్లోనూ తొలి సెట్ కోల్పోయినా మళ్లీ పుంజుకున్నా. ఆత్మవిశ్వాసంతో ఆడి విజేతగా నిలిచాను. అందుకే.. ఈ టైటిల్ గెలవడంతో చాలా గర్వంగా అనిపిస్తోంది. చెప్పాలంటే ఈ నెల మొత్తం నాకు కోర్టులోపలా, కోర్టు బయటా సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి ఇక్కడకు వచ్చాను. నా కష్టం ఫలిచింది. మాంటో కార్లో మాస్టర్స్ టైటిల్ నెగ్గడంతో చాలా సంతోషంగా ఉన్నాను’ అని మ్యాచ్ అనంతరం తెలిపాడు అల్కరాజ్.